టాలీవుడ్ తెర ఎరుపెక్కుతోంది

తెలుగు సినిమా తెరమీద రక్తం పారుతోంది. ఒకప్పుడు హత్యలు లాంటి షాట్స్ చూపించేటప్పుడు వీలైనంత వయొలెన్స్ ఎక్స్ పోజ్ కాకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడేవారు. శివలో శుభలేఖ సుధాకర్ మర్డర్ సీన్ ఒక్కటి చాలు బ్లడ్ లేకుండా ఎలా భయపెట్టవచ్చో రామ్ గోపాల్ వర్మ రుచి చూపిస్తారు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. కరోనా వల్లనో లేక వెబ్ సిరీస్ లు చూసి చూసి జనాల్లో సున్నితత్వం పోవడం వల్లనో ఏదైతేనేం మన ఫిలిం మేకర్స్ మొహమాటాలు పక్కనపెడుతున్నారు. కంటెంట్ డిమాండ్ చేస్తే ఎంత హింసనైనా పచ్చిగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. దానికి నిదర్శనమే ఇటీవలే వచ్చిన టీజర్లు.

రౌడీ జనార్ధనలో విజయ్ దేవరకొండ మొహం మొత్తం నెత్తురుతో నిండిపోయి అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరికే అవతారంలో కొంచెం భయపెట్టేలా ఉంది. సిక్స్ ప్యాక్ బాడీ మీద కూడా రక్తం ఏరులై పారింది. కాబోయే జీవిత భాగస్వామి రష్మిక మందన్న సైతం మైసాలో ఇలాంటి ఊర మాస్ లేడీ గెటప్ లో నరకడానికి సిద్ధ పడుతోంది.

చాలా గ్యాప్ తర్వాత రవిబాబు తీస్తున్న రేజర్ టీజర్ చూస్తే చిన్న పిల్లలు జడుసుకోవడం ఖాయం. హాలీవుడ్ సా సిరీస్ ని మించిపోయేలా హింసని చూపించిన తీరు బాప్రే అనిపించింది. ఇది హఠాత్తుగా మొదలయ్యింది కాదు. నానిలాంటి ఫ్యామిలీ హీరోనే దసరా, హిట్ 3 ది థర్డ్ కేస్ తో ఈ రూటు ఆల్రెడీ పట్టాడు.

రాబోయే ది ప్యారడైజ్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దీని తర్వాత తీయబోయే సినిమాలో చిరంజీవి చేతిని నెత్తురులో ముంచడం ద్వారా కంటెంట్ ఎలా ఉండబోతోందో శాంపిల్ ఇచ్చేశాడు.

యానిమల్ ఇంటర్వెల్ బ్లాక్ లో రన్బీర్ కపూర్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సృష్టించిన భీభత్సం అంత సులభంగా మర్చిపోగలమా. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు వస్తుంది కానీ క్రమంగా సున్నితత్వం పోయి ఇలా హత్యా కాండలు చూపించడం మాములు విషయమైపోయేలా ఉంది. సెన్సార్ ఏ సరిఫికేట్ ఇచ్చినా పర్వాలేదు మేము మాత్రం బోల్డ్ అండ్ కల్ట్ కంటెంట్స్ తీస్తామని యువ దర్శకులు శపధాలు చేసేలా ఉన్నారు.