బాలయ్య వచ్చినా తగ్గని దురంధర్

మూడున్న‌ర గంట‌ల‌కు పైగా నిడివి అంటే ప్రేక్ష‌కులు భ‌రించ‌గ‌ల‌రా? ర‌ణ్వీర్ సింగ్ మీద ఒక సినిమా అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడు స్వీయ నిర్మాణంలో 350 కోట్ల బ‌డ్జెట్ పెట్టి సినిమా తీయ‌డ‌మేంటి? అడ్వాన్స్ బుకింగ్స్ డ‌ల్లుగా ఉన్నాయి, మ‌రి ఓపెనింగ్స్ వ‌స్తాయా? అంటూ దురంధ‌ర్ సినిమా విడుద‌ల‌కు ముందు ఎన్నో సందేహాలు. కానీ రిలీజ్ త‌ర్వాత అంతా మారిపోయింది. తొలి రోజే మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఆ చిత్రం.. త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తొలి రోజు కన్నా రెండో రోజు.. రెండో రోజు క‌న్నా మూడో రోజు వ‌సూళ్లు పెరిగాయి. వీక్ డేస్‌లో కూడా సినిమా బ‌లంగా నిల‌బ‌డింది. 

రెండో వీకెండ్లో అయితే కొత్త సినిమాలా వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది దురంధ‌ర్. సినిమా ఊపు చూస్తుంటే కొన్ని వారాల పాటు బాక్సాఫీస్‌ను ఏలుతుంద‌నిపిస్తోంది. ఆల్రెడీ రూ.500 కోట్ల మార్కును దాటేసిన దురంధ‌ర్‌.. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస‌ర్‌గా ఇదే నిలిచినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు ట్రేడ్ పండిట్లు. పేరుకు హిందీ సినిమానే కానీ.. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ద‌క్షిణాదిన ప్ర‌ధాన న‌గరాల్లో ఈ సినిమాకు రెండో వీకెండ్లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి.

అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే.. తెలుగులో ఈ వీకెండ్ అఖండ-2 లాంటి భారీ చిత్రం విడుద‌లైంది. అయినా స‌రే.. హైద‌రాబాద్ స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో దురంధ‌ర్ హౌస్ ఫుల్ వ‌సూళ్ల‌తో న‌డుస్తోంది. అఖండ‌-2 కార‌ణంగా తొలి వారంతో పోలిస్తే రెండో వీక్ దురంధ‌ర్‌కు స్క్రీన్లు, షోలు త‌గ్గాయి. కానీ ఆడుతున్న ప్ర‌తి థియేట‌ర్లో సినిమాకు శ‌ని, ఆదివారాల్లో చాలా వ‌ర‌కు హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి. సింగిల్ స్క్రీన్ల‌లో ఒక హిందీ చిత్రానికి రెండో వీకెండ్లో థియేట‌ర్లు నిండిపోవ‌డం అరుదైన విష‌యం. 

ఈ ఏడాది ఆరంభంలో ఛావా సినిమాకు ఇలాంటి స్పంద‌నే క‌నిపించింది. సైయారా కూడా బాగా ఆడింది కానీ.. మ‌ల్టీప్లెక్సుల్లోనే ఆ సినిమాను బాగా చూశారు. కానీ దురంధ‌ర్.. ఛావా, సైయారా చిత్రాల‌ను మించి స్పంద‌న తెచ్చుకుంటోంది. ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్, ఏఎంబీ లాంటి ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి శ‌ని, ఆదివారాల్లో అడ్వాన్స్ ఫుల్స్ ప‌డ్డాయి. బుక్ మై షోలో షోలు సోల్డ్ ఔట్ చూపించాయి. ఇంకా సిటీలోని ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్సుల్లో దాదాపుగా ప్ర‌తి షో జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. అఖండ‌-2 లాంటి భారీ చిత్రం పోటీలో ఉండ‌గా.. ఒక హిందీ సినిమాకు ఇలాంటి స్పంద‌న రావ‌డం అనూహ్యం.