అవతార్ క్రేజ్ పెరిగిందా తగ్గిందా

ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్ సోషల్ మీడియాలో కనిపించాలి. కానీ అంత హడావిడి లేదు. వీరాభిమానులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు కానీ ఏదో వెర్రెత్తిపోయే రేంజ్ లో ట్వీట్లు గట్రా పెట్టడం లేదు. అవతార్ 2తో పోల్చుకుంటే ఓపెనింగ్ తో పాటు ఫైనల్ నెంబర్స్ తక్కువగా ఉండొచ్చని ట్రేడ్ అంచనాలు వేస్తోంది. ఒక్క ఇండియా నుంచే నాలుగు వందల యాభై నుంచి అయిదు వందల కోట్ల దాకా గ్రాస్ ఆశిస్తున్న నిర్మాతలు దాన్ని అందుకోవడం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు హాలీవుడ్ రిపోర్ట్స్.

అయితే అవతార్ క్రేజ్ తగ్గిందా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం కనిపిస్తుంది. ఎందుకంటే అవతార్ మొదటిసారి చూసినప్పుడు ఆడియన్స్ సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని జేమ్స్ క్యామరూన్ ఆవిష్కరించిన తీరుకి కనకవర్షం కురిపించారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో వంద రోజులు ఆడే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు. అవతార్ 2కి క్రేజ్ వచ్చిన మాట వాస్తవమే కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేదనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వచ్చాయి. అయినా సరే సీక్వెల్ హైప్ వల్ల నాలుగు వందల డెబ్భై కోట్ల దాకా గ్రాస్ వసూలయ్యింది.

ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ నిజంగా మేజిక్ చేస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. పండోరాలో కొత్తగా యష్ అనే జాతిని ప్రవేశపెట్టిన జేమ్స్ క్యామరూన్ ఈసారి ఎలాంటి కొత్త అనుభూతి ఇస్తారో చూడాలి. లేదూ అదే కథను రెండు మూడు ట్విస్టులు మార్చి మళ్ళీ చూపిస్తా అంటే మాత్రం కష్టమే. ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మన దేశంలో అమ్ముడుపోయిన టికెట్లు ఎనభై వేల దాకా ఉన్నాయట. ఇది ఇంకా పెరగాలి. కనీసం రెట్టింపు స్థాయిలో డైలీ నెంబర్లు నమోదు చేయాలి. ఫస్ట్ డే కనీసం నలభై కోట్ల ఓపెనింగ్ వస్తేనే బ్లాక్ బస్టర్ ఆశలు పెట్టుకోవచ్చు. టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా సరే దెబ్బ కొంచెం గట్టిగానే పడుతుంది.