2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఆ చిత్రం చెరిపేసింది. ఆ సినిమా రికార్డులు బద్దలు కావడానికి కొన్నేళ్లు పట్టింది. అవతార్ సాధించిన అసాధారణ విజయం చూశాక.. ఆ చిత్రానికి నాలుగు సీక్వెల్స్ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్. కానీ మూడేళ్ల ముందు వచ్చిన తొలి సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
ప్రి రిలీజ్ హైప్ వల్ల ఈ సినిమాకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా ఈ చిత్రం కొంతమేరకు నిరాశపరిచిన మాట వాస్తవం. అది ఏ స్థాయిలో డిజప్పాయింట్ చేసిందంటే.. అవతార్ నెక్స్ట్ సీక్వెల్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంటే కనిపించడం లేదు. అవతార్, అవతార్-2ల హైప్‌తో పోలిస్తే.. మినిమం బజ్ కూడా లేదు మూడో పార్ట్ కు.
ఐతే వరల్డ్ వైడ్ అన్ని భాషల్లోనూ డిసెంబరులో మూడో వీకెండ్‌ను అవతార్-3కే అంకితం చేసేశారు. ఇండియాలో కూడా అవతార్-3 కోసమని ఆ వీకెండ్‌ను ఖాళీగా వదిలేశారు. తెలుగులో కూడా డిసెంబరు 19కు కొత్త రిలీజ్‌లు ఏమీ లేవు. ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. క్రిస్మస్ వీకెండ్లోనూ పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. అఖండ-2 ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది.
ఐతే రాబోయే వీకెండ్లో, క్రిస్మస్ వీకెండ్లో అంత పోటీలో నిలబడే బదులు డిసెంబరు 19కి ఒకట్రెండు సినిమాలను షెడ్యూల్ చేస్తే బాగుండేదేమో. పెద్దగా బజ్ లేని అవతార్-3ని చూసి అంతగా భయపడాలా అన్నది ప్రశ్న. ఆ సినిమాకు చాలా మంచి టాక్ వస్తే తప్ప.. కంగారుపడాల్సినంత సినిమా కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్-3 గత రెండు చిత్రాల స్థాయిలో ప్రభావం చూపుతుందా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి దాంతో పాటుగా ఒకట్రెండు సినిమాలను రిలీజ్ చేస్తే ఇబ్బంది లేకపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates