కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు వినిపించాయో తెలిసిందే. కానీ కూలీ రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాక అంతా మారిపోయింది. తన సినిమాలు ఒక్కొక్కటిగా అటకెక్కేస్తున్న సంకేతాలు కనిపించాయి. రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్ అతడి చేజారింది. ఖైదీ-2 ముందుకు కదల్లేదు. అలాగే కూలీలో క్యామియో రోల్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్‌తో లోకేష్ చేయాల్సిన సూపర్ హీరో మూవీ కూడా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇంకోవైపు అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి అగ్ర తారలతో సినిమా చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. మొత్తంగా చూస్తే లోకేష్ తర్వాతి సినిమాల్లో ఏదీ కన్ఫమ్ అయితే కాలేదు. ప్రస్తుతం అతను హీరోగా డీసీ అనే సినిమా మాత్రం తెరకెక్కుతోంది. దానికి పెద్దగా బజ్ లేదు. ఇలాంటి టైంలో ఆమిర్ ఖాన్.. లోకేష్ కనకరాజ్‌త మూవీ గురించి ఒక ఇంటర్వ్యూలో పాజిటివ్‌గా మాట్లాడ్డం విశేషం.
లోకేష్ కనకరాజ్‌తో తన సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలను ఆమిర్ ఖండించాడు. తన తర్వాతి చిత్రం అతడి దర్శకత్వంలోనే ఉంటుందని ఆమిర్ స్పష్టం చేశాడు. ఇటీవలే లోకేష్ తనతో ఫోన్లో మాట్లాడాడని.. త్వరలో ముంబయికి వచ్చి పూర్తి స్క్రిప్టు వినిపిస్తానని కూడా చెప్పాడని ఆమిర్ వెల్లడించాడు. తాను ఇకపై స్పీడు పెంచాలనుకుంటున్నానని.. ఏడాదికో సినిమా చేయాలని అనుకుంటున్నానని ఆమిర్ చెప్పడం విశేషం.
మొత్తానికి కూలీ ముందు వరకు లోకేష్‌తో సినిమా చేయడానికి అమితాసక్తి చూపించిన హీరోలు, నిర్మాతల్లో ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతుంటే.. ఆమిర్ మాత్రం మాట మీద నిలబడబోతున్నాడన్నమాట. ఆమిర్‌తో లోకేష్.. ఇరుంబుకు మాయావి అనే ఫాంటసీ సూపర్ హీరో సినిమా చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ గురించి కూడా ఓ క్రేజీ న్యూస్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమిర్ నో చెప్పడంతో ఆ కథనే అల్లు అర్జున్‌తో చేయడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు రూమర్లు వచ్చాయి. కానీ ఆమిర్ స్వయంగా తాను లోకేష్‌తో సినిమా చేయబోతున్నట్లు చెప్పడంతో ఆ కథనే పట్టాలెక్కిస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates