రామ్ పోతినేని కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని కథ. ఇందులో ఆంధ్రా కింగ్ అనే స్టార్ హీరో పాత్రను కన్నడ నటుడు ఉపేంద్ర పోషించాడు. తన అభిమానిగా రామ్ కనిపించాడు. ఐతే ఇక్కడ ఎంతోమంది సీనియర్ స్టార్లు ఉండగా.. కన్నడ నుంచి ఉపేంద్రను తీసుకొచ్చి ఈ పాత్రలో నటింపజేయడం ఏంటి అనే చర్చ జరిగింది. ఉపేంద్రను ఈ పాత్ర కోసం ఎంచుకుని అనౌన్స్‌మెంట్ ఇచ్చినపుడు ఈ ఎంపిక కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ నిన్న సినిమా చూశాక మాత్రం అందరూ ఉపేంద్రనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో ఉపేంద్ర పాత్ర నిడివి మరీ ఎక్కువ ఏమీ ఉండదు. 20-25 నిమిషాలకు మించి కనిపించడు ఉప్పి దాదా. ఇలాంటి పాత్రలో టాలీవుడ్ స్టార్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్ల పాత్రకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పైగా ఇందులో ఆ హీరో పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఉండదు. క్లైమాక్స్‌లో ఆ స్టార్ హీరోనే అభిమాని పాత్రకు ఎలివేషన్ ఇస్తాడు. ఇలాంటి పాత్రను టాలీవుడ్ స్టార్ ఎవరైనా చేసి ఉంటే.. అభిమానులు కొంత ఫీలయ్యేవాళ్లేమో. అదే సమయంలో ఒక స్టార్ హీరో ఈ పాత్ర చేస్తే.. వేరే హీరోల అభిమానులు ఈ చిత్రానికి సపోర్ట్ ఇచ్చేవారా అన్నది సందేహమే.
కానీ ఇప్పుడు ఉపేంద్ర విషయంలో మన ప్రేక్షకులందరూ ఒకే రకంగా స్పందిస్తున్నారు. లెక్కలు వేసుకోకుండా ఆ పాత్రను పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. ఉపేంద్రకు వ్యక్తిగతంగా ఉన్న హంబుల్ ఇమేజ్ ఈ పాత్రకు బాగా ఉపయోగపడింది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఉపేంద్ర ఈ పాత్రను చాలా బాగా పండించాడు. కన్నడ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో కానీ.. తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఉపేంద్రనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates