రామ్ కెరీర్‌‌… అటో ఇటో తేలిపోతుంది

యువ కథానాయకుడు రామ్ తన తొలి చిత్రం ‘దేవదాస్’తోనే తన టాలెంట్ ఏంటో చూపించేశాడు. చాలా వేగంగా అతను స్టార్ హీరోగా ఎదిగాడు. ఐతే మాస్ ఇమేజ్ పట్ల వ్యామోహంతో అతను తనలోని పెర్ఫామర్‌ను వెనక్కి నెట్టేశాడనే అభిప్రాయం కలుగుతుంది. కెరీర్ ఆరంభంలో ‘కందిరీగ’ పెద్ద హిట్టవడంతో అతను ఆ తరహా సినిమాలే ఎక్కువ చేస్తూ పోయాడు. 

ఐతే తన లుక్స్, నటుడిగా తనకున్న ప్రతిభ ప్రకారం చూస్తే.. కొంచెం క్లాస్ టచ్ ఉన్న, పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలు చేస్తే తనకు బాగా నప్పుతాయనే అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. కానీ రామ్ ఆ బాటలో నడిచింది తక్కువ. ఎక్కువగా మాస్ మంత్రమే పఠించాడు. కానీ ఆ టైపు సినిమాలు వరుసగా దెబ్బ కొట్టడంతో ఇప్పుడు కొంచెం రూటు మార్చాడు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా చేశాడు. గురువారమే ఈ చిత్రం విడుదలవుతోంది.

ఈ చిత్రంలో రామ్ ఒక స్టార్ హీరోగా అభిమానిగా నటించాడు. రామ్ స్వయంగా ఒక స్టార్. మాస్ ఇమేజ్ ఉంది. అలాంటి వాడు ఇలా ఒక స్టార్ హీరోకు అభిమానిగా నటించడం అరుదైన విషయం. ఇలాంటి కథ తెలుగులో రావడం కూడా అరుదే. లుక్‌తో సహా అన్నీ మార్చుకుని ఈ పాత్రను పండించడానికి రామ్ గట్టి ప్రయత్నమే చేసినట్లున్నాడు. ఇది తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని మొదట్నుంచి చెబుతూనే వస్తున్నాడు రామ్. 

అందుకే సొంతంగా ఒక పాట రాశాడు, ఒక పాట పాడాడు. మేకింగ్‌లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రమోషన్లలో కూడా ఎక్కువగా పాల్గొంటున్నాడు. ఈ సినిమా హిట్టవడం రామ్‌కు చాలా అవసరం. అదే జరిగితే.. మాస్ మాస్ అంటూ రొటీన్ సినిమాలకు పరిమితం కాకుండా, ఇలాంటి భిన్నమైన ప్రయత్నాలు మరిన్ని చేసే అవకాశముంది. తద్వారా రామ్‌ను రిఫ్రెషింగ్ స్టోరీలు, క్యారెక్టర్లు, లుక్స్‌లో చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది. మరి రేప్పొద్దున ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.