NBK 111 – ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారే…!

వరసగా నాలుగు బ్లాక్ బస్టర్లు చవి చూసి అయిదోదానికి అఖండ 2తో రెడీ అవుతున్న బాలకృష్ణ కొత్త సినిమా ఇవాళ ప్రారంభం కాబోతోంది. వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని మరోసారి బాలయ్యతో చేతులు కలిపారు. ఈ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ కాంబోలో ఇంకో చిత్రం చేయాలని ప్రాధమికంగా అనుకున్నారు. పెద్దితో ప్రొడక్షన్ ఎంట్రీ ఇస్తున్న వృద్ధి బ్యానర్ కు మైత్రి అండదండలు ఉండటంతో ఇప్పుడీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు సాధ్యమయ్యింది. సన్నీడియోల్ జాట్ చేశాక గోపిచంద్ మలినేని తీస్తున్న మూవీ ఇదే. అయితే దీనికి సంబంధించిన విశేషాలు అభిమానుల్లో అంచనాలు పెంచేలా ఉన్నాయి.

బాలయ్య ఇందులో రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. శతాబ్దాల వెనుక చక్రవర్తుల బ్యాక్ డ్రాప్ తో పాటు వర్తమానంతో ముడిపెట్టి డిఫరెంట్ సెటప్ రాసుకున్నారని తెలిసింది. గౌతమీపుత్ర శాతకర్ణిలో ఈ తరహా పాత్ర బాలయ్య చేసినప్పటికీ అది కాల్పనిక కథ కాకపోవడంతో దర్శకుడు క్రిష్ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. కానీ గోపీచంద్ మలినేనికా సమస్య లేదు. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ గ్లాడియేటర్ అనిపించే రేంజ్ లో ఆహార్యం, డైలాగులు, యుద్ధ సన్నివేశాలు ఉంటాయట. నయనతార సైతం వీరవనిత మహారాణిగా గతంలో చెయని క్యారెక్టర్ తో మెరవనుందని యూనిట్ టాక్.

అఖండ 2 తర్వాత బాలయ్య నుంచి వచ్చే సినిమా ఇదే కానుంది. సంగీతం తమనే సమకూర్చబోతున్నాడు. క్యాస్టింగ్, టీమ్ తదితర వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. వ్యక్తిగతంగా బాలకృష్ణకు గోనగన్నారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కొంతమేర శాతకర్ణితో తీర్చుకున్నారు. ఇప్పుడీ ఎన్బికె 111తో వాటిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళబోతున్నారు. 2026 దసరా లేదా దీపావళి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం పడటంతో విడుదల విషయంలో ఏ మేరకు కట్టుబడతారో వేచి చూడాలి.