ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక సంచలనం. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే కామెడీ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత కొన్నేళ్లు ఈ కుర్రాడు కనిపించలేదు. కట్ చేస్తే.. మూడేళ్ల కిందట ‘లవ్ టుడే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాదు.. తనే హీరోగానూ నటించాడు. ఆ సినిమా పోస్టర్లు, ప్రోమోలు చూసి ఇతను హీరో ఏంటి అన్నవాళ్లే ఎక్కువమంది.
కానీ యూత్‌కు పిచ్చెక్కించేలా ఆ సినిమా తీయడమే కాక.. అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వడంతో సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. పక్కింటి కుర్రాడిలా కనిపించే ప్రదీప్‌లో చాలామంది యూత్ తమను తాము చూసుకున్నారు. ‘లవ్ టుడే’ ఏకంగా వంద కోట్ల క్లబ్బులో చేరింది. అదేదో ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం కలగకుండా ప్రదీప్ తర్వాత కూడా ఘనవిజయాలను అందుకున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘డ్రాగన్’ ఇంకా పెద్ద హిట్టయింది. ఇక దీపావళికి ‘డ్యూడ్’తో ఇంకో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్. అరంగేట్రం నుంచి వరుసగా మూడు సినిమాలూ వంద కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి హీరోగా ప్రదీప్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న వారసులు కూడా సాధించని ఘనత ఇది. ఐతే ఇప్పుడు ప్రదీప్‌ను ఇంకో రికార్డు ఊరిస్తోంది. ఒకే ఏడాది మూడు హిట్లు అందుకునే అరుదైన అవకాశం అతడి ముందు ఉంది. ‘డ్యూడ్’ వచ్చిన రెండు నెలలకే తన కొత్త చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ కానుంది.
నయనతార భర్త విఘ్నేష్ శివన్ రూపొందించిన ఈ చిత్రం.. డిసెంబరు 18న రిలీజ్ కానుంది. నిజానికి ‘డ్యూడ్’ కంటే ముందు ఇదే మొదలైంది. దీన్ని కూడా దీపావళికే విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రదీపే నిర్మాతలను ఒప్పించి దీన్ని రెండు నెలలు వాయిదా వేయించాడు. ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి ఇందులో హీరోయిన్. ప్రదీప్ మ్యాజిక్ మరోసారి వర్కవుట్ అవుతుందని.. ఇది కూడా హిట్ అవుతుందని తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనికి కూడా హిట్ టాక్ వచ్చిందంటే వంద కోట్ల వసూళ్లు ప్రదీప్‌కు కేక్ వాక్ అన్నట్లే. అదే జరిగితే.. ఒకే ఏడాది మూడు వందల కోట్ల సినిమాలు అందించిన రికార్డు ఎప్పటికీ నిలిచిపోతుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates