ఒక ఫోటో దిగుదామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అడిగినట్లు.. తిరస్కరిస్తూ హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లిపోయినట్లు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బ్రహ్మానందం తాజాగా వివరణ ఇచ్చారు. దయాకర్ తో తనకు 30ఏళ్ల బంధం ఉందన్నారు. మంచి మిత్రులం. చాలా ప్రేమగా చూసుకుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతోనే ‘ఉండండి’ అంటూ ముందుకు వెళ్లిపోయాను.. అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే.. నటుడు మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో బ్రహ్మానందానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఫొటో దిగుదామని ఆయన కోరారు. బ్రహ్మానందం తిరస్కరించడంతో అది కాస్తా వైరల్ మారింది. దీనిపై వివరణ ఇస్తూ బ్రహ్మానందం ఒక వీడియో విడుదల చేశారు.
తాను ఉదయాన్నే ఒక వీడియో చూసి నవ్వుకున్నా అన్నారు. మోహన్ బాబు ఫంక్షన్ కు లేట్ అవడంతో తాను హడావుడిగా వెళ్ళాను అన్నారు. అంతలో.. దయన్న ఎదురయ్యాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఇంతలో ‘ఫొటో తీసుకుందాం’ అని ఆయన అడిగారు. నేను వద్దంటూ లోపలికి వెళ్లిపోయాను. దీన్ని కొందరు అపార్థం చేసుకున్నారని తెలిపారు.
ఆయనతో తనకు 30ఏళ్ల బంధం ఉందన్నారు. నేను తోసేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత కూడా నేను, ఆయన కలిసి మాట్లాడుకున్నాం అని అన్నారు. ఈ రోజు ఉదయం ఆ వీడియో చూడగానే ఇద్దరం నవ్వుకున్నాం. ‘అన్నా తప్పుగా అర్థం చేసుకున్నారు’ అంటూ ఆయన కూడా నాతో మాట్లాడారని తెలిపారు. దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి అని బ్రహ్మానందం వివరణ ఇచ్చారు. అయితే దయాకర్ మాత్రం దీనిపై ఇంత వరకు స్పందించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates