సింహం టైమింగ్ తేడా కొట్టినట్టుందే

రేపు చిరంజీవి 1990 క్లాసిక్ కొదమసింహం రీ రిలీజ్ కానుంది. నిన్న మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్లో క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిర్మాత కె మురళీమోహనరావు ఒరిజినల్ నెగటివ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం ఎంత మేలు చేసిందో స్క్రీన్ మీద అవుట్ ఫుట్ చూశాక అర్థమయ్యింది. ఏదో కొత్త సినిమా చూస్తున్న స్థాయిలో రీ మాస్టరింగ్ వర్క్ అద్భుతంగా కుదిరింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. వాళ్లకు అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం సగం కూడా అడ్వాన్స్ గా ఫుల్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇలా జరగడానికి ప్రధాన కారణం టైమింగ్. రేపు చిన్నవో పెద్దవో సుమారు పది దాకా కొత్త రిలీజులు ఉన్నాయి. వాటిలో 12 ఏ రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే అంతో ఇంతో బజ్ తెచ్చుకున్నాయి. టాక్ బాగుంటే దేనికైనా మధ్యాన్నం నుంచే పికప్ ఉంటుంది. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేసుకుంది. ఇవి కాకుండా మరో మూడు డబ్బింగులు, ఇంకో నాలుగు చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. వీటికి షోలు సర్దుబాటు చేయడమే చాలా చోట్ల కష్టంగా మారిన టైంలో కొదమసింహంకు స్లాట్లు దొరకడం కష్టమైపోయింది. అందుకే బజ్ విషయంలో శివ లాగా హడావిడి కనిపించ లేదు.

మరో రీజన్ ఉంది. పబ్లిసిటీని టీమ్ మరీ సీరియస్ గా తీసుకోలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరికి చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకుని అశ్వినిదత్, రాఘవేంద్రరావులతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వీడియో బైట్స్ వదిలారు. వైజయంతి మూవీస్ నాన్ స్టాప్ గా సోషల్ మీడియాలో చేసిన హంగామా వల్ల జనంలో ఆసక్తి పెరిగింది. ఫలితం ఓపెనింగ్స్, కలెక్షన్స్ రెండూ వచ్చాయి. అందులోనూ పెద్దగా పోటీ లేని టైంలో రావడం ప్లస్ అయ్యింది. కానీ కొదమసింహంకు వాతావరణం అంత అనుకూలంగా లేదు. మరి రేపు, వీకెండ్ లో ఏమైనా అనూహ్యంగా పికప్ చూపించి వసూళ్లు తెస్తుందేమో వేచి చూడాలి.