ఢిల్లీ సంఘటన ఎఫెక్ట్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై ఉంటుందా?

ఒక సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మైంది మ‌హేష్ బాబు-రాజ‌మౌళి చిత్ర యూనిట్. షూటింగ్ మొద‌లై చాన్నాళ్ల‌యినా ఇప్ప‌టిదాకా ఈ సినిమా విశేషాలేమీ పంచుకోని సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15న టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శివార్ల‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు కొన్ని వారాల ముందే ప‌నులు మొద‌ల‌య్యాయి. 

ఈ ఈవెంట్‌కు వారం ముందు నుంచి వేరే అప్‌డేట్స్ ఇస్తోంది చిత్ర బృందం. వీటికి మంచి స్పంద‌నా వ‌స్తోంది. ఇక ఫ‌స్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎలా ఉండ‌బోతోందో అని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌ను విశాల ప్రాంగ‌ణంలో నిర్వ‌హించ‌బోతున్నారు. అక్క‌డ ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ నిర్మాణం కూడా జ‌రుగుతోంది. దాదాపు ల‌క్ష‌మంది అభిమానుల మ‌ధ్య ఈ వెంట్ చేయాల‌నుకున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సాఫీగా సాగిపోతున్న వేళ‌.. దేశంలో అల‌జ‌డి నెల‌కొంది.

దిల్లీలో కారు బాంబు పేలుడు ఘ‌ట‌న త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా హై అలెర్ట్ నెల‌కొంది. మెట్రో న‌గ‌రాల‌న్నింటినీ అప్ర‌మ‌త్తం చేశారు. ఆ సిటీస్ కేంద్ర బ‌ల‌గాల చేతుల్లోకి వెళ్లాయి. ఉగ్ర‌వాదులు మ‌రిన్ని పేలుళ్ల‌కు కుట్ర చేశార‌న్న స‌మాచారంతో ఉత్కంఠ నెల‌కొంది. ఈ ప‌రిస్థితుల్లో గ్లోబ్ ట్రాట‌ర్ ఈవెంట్ మీద నీలి నీడలు క‌మ్ముకుంటున్నాయి. ఇంత భారీ జ‌నంతో ఈవెంట్ నిర్వ‌హించ‌డం సాధ్య‌మా.. అందుకు అనుమతులు ల‌భిస్తాయా అన్న‌ది అనుమానంగా మారింది. మ‌హేష్ బాబు, రాజ‌మౌళి స‌హా ఎంతోమంది వీఐపీలు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. 

ఈ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించాల్సి ఉంటుంది. ల‌క్ష‌మంది కాక‌పోయినా 50-60 వేల మంది జ‌నాన్న‌యైనా కంట్రోల్ చేయ‌డం, ఈవెంట్ సాఫీగా నిర్వ‌హించ‌డం అంత తేలిక కాదు. ఈ నేప‌థ్యంలో ఈవెంట్‌ను ర‌ద్దు చేసే ప‌రిస్థితి వ‌స్తుందా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఈవెంట్‌ను వాయిదా వేయ‌లేని ప‌రిస్థితులు ఉంటే.. అభిమానుల సంఖ్య‌ను బాగా త‌గ్గించి.. చిన్న స్థాయిలో చేసుకోవాల‌నే ఆదేశాలు రావ‌చ్చు. భ‌ద్ర‌త బ‌ల‌గాల‌ను కూడా బాగా త‌గ్గించే అవ‌కాశాలున్నాయి.