రాజమౌళి ఏం వండుతున్నాడబ్బా…

ఒకప్పుడు రాజమౌళి సినిమా అంటే తెలుగు వాళ్లు మాత్రమే ఊగిపోయేవాళ్లు. కానీ ‘బాహుబలి’తో దేశం మొత్తాన్ని ఊపేసి అందరూ తన సినిమా కోసం ఎదురు చూసేలా చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ అనుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో అప్లాజ్ తెచ్చుకుని తన కొత్త సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూసేలా చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న రూపొందిస్తున్న సినిమాపై వరల్డ్ వైడ్ ఏ స్థాయిలో హైప్ ఉందో చెప్పాల్సిన పని లేదు. 

తన మీద పెరిగే అంచనాలు అందుకోవడానికి మరింత కష్టపడే రాజమౌళి.. మరోసారి అద్భుతాలు ఆవిష్కరిస్తాడనే అంచనాలే ఉన్నాయి. మామూలుగా తన సినిమా కథ.. విశేషాల గురించి ఆరంభ దశలోనే మీడియాతో, అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు రాజమౌళి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. సినిమా మొదలైన విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించకుండా.. ఏ చిన్న విశేషాన్నీ పంచుకోకుండా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేశాడు.

ఐతే ఎట్టకేలకు రాజమౌళి-మహేష్ మూవీ నుంచి అఫీషియల్ అప్‌డేట్ రాబోతోంది. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే భారీ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయించబోతున్నాడు రాజమౌళి. దీని గురించి తనదైన శైలిలో మార్కెటింగ్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు. ఈ రోజు సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ముందుగా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో పృథ్వీరాజ్ కుంభా అనే పాత్ర చేస్తున్నాడు. అది విలన్ క్యారెక్టరే అయి ఉంటుందని భావిస్తున్నారు. 

శరీరం చచ్చుబడి చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్ర తనది. కానీ అతడి చక్రాల కుర్చీ సాధారణమైంది కాదు. చాలా శక్తులున్న విచిత్ర వాహనంలా కనిపిస్తోంది. పృథ్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ డ్రాప్ డిజైనింగ్ అంతా చూస్తే  సినిమాలో సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇంతకుముందు రిలీజ్ చేసిన మహేష్ బాబు ప్రి లుక్‌లో తన మెడలో దేవుడి లాకెట్ కనిపించింది. అది చూస్తే ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు డివైన్ పవర్ చుట్టూ కథ నడుస్తుందనిపించింది. ఈ రెంటినీ లింక్ చేసి చూస్తే ‘కల్కి’ తరహాలోనే దేవుడు-సైన్స్ రెంటినీ మిక్స్ చేసి ఏదో పెద్దగానే కుక్ చేస్తున్నట్లున్నాడు జక్కన్న. 15న టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యాయంటే కథ గురించి మరింత క్లారిటీ రావచ్చు.