శ్రీలీల‌ను కాపాడాల్సింది ఆ శక్తే…

టాలీవుడ్లో చాలా త‌క్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి.. శ్రీలీల‌. క‌ర్ణాట‌క‌లో పెర‌గ‌డం వ‌ల్ల‌ పేరుకు ఆమె క‌న్న‌డ అమ్మాయి కానీ.. త‌న మూలాలు తెలుగువే. అందుకే త‌న‌ను తెలుగు హీరోయిన్‌గానే చూస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. శ్రీలీల తొలి చిత్రం పెళ్ళిపంద‌డిలో త‌న అందం, అభిన‌యం, నృత్య ప్ర‌తిభ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని త‌న‌కు అవ‌కాశాలు తెచ్చిపెట్టాయి. రెండో సినిమా ధ‌మాకా బ్లాక్ బస్ట‌ర్ కావ‌డంతో శ్రీలీల పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

మ‌హేష్ బాబు స‌హా చాలామంది స్టార్ల‌తో సినిమాలు చేసింది. ఐతే ఛాన్సుల‌కైతే లోటు లేదు కానీ.. శ్రీలీల‌కు విజ‌యాలు మాత్రం ద‌క్క‌ట్లేదు. గ‌త మూడేళ్ల‌లో ఆమె అర‌డ‌జ‌నుకు పైగా ఫ్లాపుల‌ను ఖాతాలో వేసుకుంది. తాజాగా మాస్ జాత‌ర రూపంలో ఆమెకు మ‌రో డిజాస్ట‌ర్ ఎదురైంది. ఫ్లాపుల‌కు హీరోయిన్ల‌ను బాధ్యుల‌ను చేయ‌లేం కానీ.. ఈ సినిమాల్లో శ్రీలీల పాత్ర‌లు రొటీన్ అయిపోతుండ‌డం, త‌న పెర్ఫామెన్స్ విష‌యంలో నెగెటివ్ రిమార్క్స్ వ‌స్తుండ‌డ‌మే ఆమెకు మైన‌స్ అవుతోంది.

ఏదైనా సినిమాలో శ్రీలీల ఉందంటే త‌నది రొటీన్ గ్లామ‌ర్ రోల్ అయి ఉంటుంది.. డ్యాన్సులు త‌ప్ప పెర్ఫామెన్స్ ఆశించ‌లేం అనే అభిప్రాయం బ‌ల‌ప‌డిపోతోంది. ఐతే ఈ అభిప్రాయాన్ని మార్చే సినిమా ఒక‌టి శ్రీలీల చేస్తోంది. అదే.. ప‌రాశ‌క్తి. గురు, ఆకాశం నీకు హ‌ద్దురా చిత్రాల‌తో గొప్ప ద‌ర్శ‌కురాలిగా పేరు సంపాదించిన సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. శివ కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అథ‌ర్వ మ‌రో హీరో. 

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించింది. అందులో శ్రీలీల లుక్ భ‌లేగా అనిపించింది. ఆ ప్రోమో చూస్తే ఇది బ‌ల‌మైన కంటెంట్ ఉన్న సినిమాలా క‌నిపించింది. శ్రీలీల కూడా పెర్ఫామెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్రే చేస్తున్న‌ట్లుంది అందులో. త‌న కెరీర్‌కు ఇది గేమ్ చేంజ‌ర్ అవుతుంద‌ని శ్రీలీల ఆశిస్తోంది. న‌ట‌న ప‌రంగా త‌న మీద ఉన్న విమ‌ర్శ‌ల‌న్నింటికీ ఈ పాత్ర‌తో స‌మాధానం చెప్పాల‌ని ఆమె భావిస్తోంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు కానీ.. వాయిదా ప‌డొచ్చ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.