బాహుబలి ది ఎపిక్ విడుదలవుతున్న వేళ ఇతర నిర్మాతల్లో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. రెండు భాగాలను ఒకే పార్ట్ గా చేయడం ద్వారా రాజమౌళి మరో ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడిటింగ్ లో రాజమౌళి చేయించిన మేజిక్ కోసం ఇతర బాషల పరిశ్రమలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ది ఎపిక్ పేరుతో రిలీజవుతున్న ఈ బ్లాక్ బస్టర్ కి ఏదో కొత్త సినిమా రేంజ్ లో అభిమానులు హడావిడి చేయబోతున్నారు. ఇది ఇండస్ట్రీ హిట్ కాబట్టి ఇలాంటి హైప్ రావడం సహజం అనుకోవచ్చు. కానీ ఫ్లాప్ మూవీస్ కి ఈ రకమైన ఎత్తుగడ ఆసక్తికరంగా అనిపిస్తోంది. అదేంటో మీరే చూడండి.
సూర్య కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్స్ లో ఒకటైన సికందర్ ( ఒరిజినల్ వెర్షన్ అంజాన్) ని త్వరలో మళ్ళీ విడుదల చేయబోతున్నారు. అయితే ఈసారి యధాతథంగా కాదు. స్క్రీన్ ప్లే మారిపోయిందనిపించేలా ఫ్రెష్ గా ఎడిటింగ్ చేయిస్తున్నారు. అప్పట్లో ఈ మూవీకి దారుణమైన రెస్పాన్స్ రావడానికి కారణం సన్నివేశాల క్రమమేనని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. సూర్య ఒక్కడే అని ప్రేక్షకులు ముందే గుర్తు పట్టేలా ఉన్నా కావాలని డ్యూయల్ రోల్ తరహాలో ప్రొజెక్ట్ చేసిన విధానం దెబ్బ కొట్టింది. ఇప్పుడు దాన్ని తగ్గించేందుకు ఇంతకు ముందు వాడని ఫుటేజ్ తో కలిపి కొత్త వెర్షన్ సిద్ధం చేయబోతున్నట్టు చెన్నై టాక్.
మహేష్ బాబు 1 నేనొక్కడినేకి సైతం ఈ తరహా ఎక్స్ పరిమెంట్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు సమాచారం. ఇంకా ఫైనల్ చేయలేదు కానీ రీ ఎడిటింగ్ చేసి కత్తిరించిన సీన్లను అవసరమైన చోట వాడుకుని రీ రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉన్నట్టు వినికిడి. అయితే దానికి సుకుమార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఆయన అంగీకారం దొరకాలి. గోపీచంద్ సాహసంని కూడా ఈ టైపులో ప్రయోగం చేయొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇవి కనక వర్కౌట్ అయితే భవిష్యత్తులో స్క్రీన్ ప్లే పరంగా కన్ఫ్యూజ్ చేసిన సినిమాలన్నీ కొత్త ఎడిటింగ్ వెర్షన్లతో ఆడియన్స్ ముందుకు వస్తాయన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates