‘కింగ్’డమ్ పోయింది… ఆంధ్ర ‘కింగ్’ కాపాడాలి

మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు డెబ్యూ మూవీ సూపర్ డిజాస్టర్ అయినా అందం, చందం వల్ల అవకాశాలు బాగానే వస్తున్నాయి. కాకపోతే సక్సెస్ అందని ద్రాక్ష పండులా ఊరిస్తూ దక్కకుండా పోతోంది. విజయ్ దేవరకొండతో మొదటిసారి జట్టు కట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ తీవ్రంగా నిరాశ పరిచింది. యాక్టింగ్ సంగతి పక్కన పెడితే తన పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం అమ్మడిని భాదించింది. సరే పోతే పోయింది దుల్కర్ సల్మాన్ కాంతతో బ్రేక్ వస్తుందని ఎదురు చూస్తుంటే అదేమో వాయిదాల పర్వంలో నలుగుతోంది తప్ప ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు.

ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే నమ్మకమంతా ఆంధ్రకింగ్ తాలూకా మీద ఉంది. రామ్ హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ కు ఎక్కేశాయి. మైత్రి ప్రొడక్షన్ కావడంతో బడ్జెట్ బాగానే పెట్టారు. ఒక స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే అనూహ్య సంఘటనల బ్యాక్ డ్రాప్ లో ఈ కథ డిఫరెంట్ గా ఉంటుందట. గతంలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్, పృథ్విరాజ్ సుకుమారన్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఈ తరహాలో నేపథ్యంలో వచ్చినప్పటికీ వాటితో పూర్తిగా సంబంధం లేని ఎలిమెంట్స్ తో ఆంధ్రకింగ్ తాలూకా మెప్పిస్తుందని అంటున్నారు.

నవంబర్ 28 విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకాకు వివేక్ మెర్విన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. టైటిల్ రోల్ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మీద పెట్టడం చూస్తే కంటెంట్ ఏదో ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది. వరస మాస్ సినిమాతో ఫెయిల్యూర్స్ చవి చూసిన రామ్ ఈసారి తన కంఫర్ట్ జోన్ అయిన లవ్ అండ్ ఫన్ కు తిరిగి వచ్చేశాడు. అటుపై వారంలో అఖండ 2 రిలీజ్ ఉన్నా రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్న ఆంధ్రకింగ్ తాలూకా మరి భాగ్యశ్రీ బోర్సేకి ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. రామ్ తో కెమిస్ట్రీ బాగా వచ్చినట్టు పాటల్లోని విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది.