అక్టోబర్ మొదటి వారం బోణీ బాగుంది. డబ్బింగ్ అయినప్పటికీ కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ పుణ్యమాని థియేటర్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఓజి రెండో వారంలో అడుగు పెట్టినా మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేయడంతో లాంగ్ రన్ కోసం బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. మిరాయ్, లిటిల్ హార్ట్స్ ఫైనల్ రన్ పూర్తయినప్పటికీ కొన్ని సెంటర్లలో కాస్త డీసెంట్ నెంబర్లతో బండి లాగిస్తున్నాయి. ఇప్పుడు కొత్త శుక్రవారం వస్తోంది. కాకపోతే ఈసారి పెద్దగా సౌండ్ లేదు. ఎందుకంటే అన్ని చిన్న సినిమాలే క్యూ కట్టాయి. ఓజి, కాంతార 1 ప్రభంజనాన్ని ముందే పసిగట్టిన నిర్మాతలు దానికి అనుగుణంగా పెద్ద చిత్రాలను లైన్ లో పెట్టలేదు.
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు పూర్తయ్యిందో కానీ అక్టోబర్ 10 ప్రేక్షకులను పలకరించనుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్ అన్నీ మిక్స్ చేశారు కానీ హీరో ఇమేజ్ దృష్ట్యా దీనికి ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే. పాజిటివ్ టాక్ వస్తే తప్ప జనం దీని మీద లుక్ వేయలేరు. ఏడాదికి పైగా విడుదల కోసం ఎదురు చూసిన మరో స్మాల్ మూవీ ‘శశివదనే’ ఎట్టకేలకు మోక్షం దక్కించుకుంది. మెగా ఫ్యాన్ అహితేజ నిర్మించిన ఈ ప్రేమకథ ఏదైనా మేజిక్ చేయాలంటే టాక్ కీలకం. ఇక ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ఇదే రోజు రానుంది. క్యాస్టింగ్ కాస్త ప్రామిసింగ్ గానే ఉంది.
సాయికుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష లాంటి నోటెడ్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ఈ మూడు తప్ప పెద్దగా చెప్పుకోదగిన రిలీజులు ఏం లేవు. ఓటిటిలో వార్ 2, మిరాయ్, త్రిబాణధారి బార్బరిక్ తో పాటు కురుక్షేత్ర యానిమేటడ్ వెబ్ సిరీస్ రాబోతోంది. థియేటర్ కన్నా ఎక్కువ సందడి, కంటెంట్ ఈసారి ఓటిటిలో ఉండటం విశేషం. అక్టోబర్ 17 మళ్ళీ యూత్ ఫుల్ మూవీస్ రాబోతున్న నేపథ్యంలో బయ్యర్ వర్గాలను కొత్త సినిమాలు ఏమైనా మెప్పిస్తాయో లేక పవన్ కళ్యాణ్, రిషబ్ శెట్టిల సహాయంతో ఇంకో వారం వాటితోనే సర్దుకుపోయేలా చేస్తాయో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates