ఆర్యన్ ఖాన్.. కొన్నేళ్ల ముందు ఈ పేరు ఒక షాకింగ్ నెగెటివ్ న్యూస్‌తో ప్రచారంలోకి వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న షారుఖ్ ఖాన్ కొడుకు అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. షారుఖ్ కొడుకైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు అంటే.. ఈ వార్త నిజమై ఉంటుందనే అంతా అనుకున్నారు. అతణ్ని దోషిలాగే చూశారు.
కానీ చివరికి ఆర్యన్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టు తేల్చింది. అతను నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఈ కేసు విషయమై ఇటు షారుఖ్ కానీ, అటు ఆర్యన్ కానీ ఏమీ మాట్లాడలేదు. ఆర్యన్ అసలు వార్తల్లో లేకుండా పోయాడు. ఎవరికీ కనిపించలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని అతను హీరోగా అరంగేట్రం చేస్తాడని.. అందుకోసమే ప్రిపరేషన్లో ఉండి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అందరికీ పెద్ద షాకిస్తూ దర్శకుడి అవతారం ఎత్తాడు కింగ్ ఖాన్ తనయుడు.
నెట్ ఫ్లిక్స్ కోసం ఆర్యన్ తీసిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రివ్యూ ప్రోమోతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక గత వీకెండ్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ నెట్ ఫ్లిక్స్‌లో దూసుకువెళ్తోంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఇండియా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ఇదొకటట. దర్శకుడిగా అరంగేట్రంలోనే ఇండస్ట్రీ చుట్టూ తిరిగ కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుని.. ఇక్కడి స్టార్ సంస్కృతి మీద సెటైర్లతో ఎంతో వినోదాత్మకంగా ఈ సిరీస్‌ను నడిపిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి.
కంటెంట్ పరంగా టాప్ రేటెడ్ షో అని చెప్పలేం కానీ.. ఆర్యన్ టాలెంట్ మాత్రం ఇందులో బాగానే కనిపించింది. అతడికున్న క్లారిటీని అందరూ ప్రశంసిస్తున్నారు. షారుఖ్ సహా ఎంతోమంది స్టార్లతో క్యామియోలు చేయించి మెప్పించిన తీరుకూ అభినందనలు దక్కుతున్నాయి. వ్యూయర్‌షిప్ పరంగా చూస్తే ఇది బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. మొత్తానికి తన మీద కొన్నేళ్ల ముందు విరుచుకుపడ్డ సోషల్ మీడియాతోనే ఇప్పుడు పొగిడించుకుంటూ తనేంటో రుజువు చేసుకున్న ఆర్యన్ స్టోరీ స్ఫూర్తిదాయకమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates