బాలీవుడ్ నటి దిశా పటానీ కుటుంబం నివసిస్తున్న బరేలీ సివిల్ లైన్స్‌లోని వారి ఫ్యామిలీ ఇంటిపై కొన్ని రోజుల క్రితం కాల్పులు జరిగిన విషయం పెద్ద కలకలం రేపింది. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ సమయంలో దిశా తండ్రి, మాజీ డీఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ, ఆమె తల్లి, అక్క ఖుష్బూ ఇంట్లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉందని స్పష్టమైంది.
కాల్పుల విషయాన్ని గోల్డీ బ్రార్ సోషల్ మీడియాలో స్వయంగా బయటపెట్టారు. దిశా, ఆమె అక్క కొన్ని మతపరమైన ప్రముఖులపై వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఈ దాడి చేశామని తెలిపాడు. అతని పోస్టులో స్పష్టమైన బెదిరింపులు ఉండగా, తన నెట్‌వర్క్‌కు చెందిన అనేక మందిని ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో కేసు మరింత సీరియస్ గా మారింది.
ఈ నేపథ్యంలో, గాజియాబాద్‌లోని ఒక ఆపరేషన్‌లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఢిల్లీ పోలీసుల క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ కలిసి జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులు రవీంద్ర (రోహ్‌టక్), అరుగ్ (సోనిపట్)పై ముట్టడి చేశారు. వారు పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్లాక్ పిస్టల్, జిగానా పిస్టల్, అనేక లైవ్ కార్ట్రిడ్జ్‌లు పట్టుబడ్డాయి. దీంతో ఈ కాల్పుల వెనుక ఒక అంతర్జాతీయ నేర ముఠా పనిచేస్తోందని పోలీసులు ధృవీకరించారు. గోల్డీ బ్రార్ నెట్‌వర్క్ ఈ ఘటన వెనుక ఉందని ఆధారాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. దిశా కుటుంబాన్ని టార్గెట్ చేసిన నేరస్తులు ఎవరి ప్రేరణతో పని చేశారో, ఇంకా ముఠాకు చెందిన వారెవరైనా దాగి ఉన్నారా అనే కోణంలో పోలీసులు వెతుకుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates