కొన్ని నెలల పాటు తీవ్ర ఘర్షణతో సాగిన మంచు కుటుంబ వివాదం ఈ మధ్యే కాస్త సద్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఎవరికి వాళ్లు సినిమాల పరంగా బిజీ అయ్యాక కుటుంబ వివాదం కొంచెం పక్కకు వెళ్లింది. ‘కన్నప్ప’ రిలీజైనపుడు మంచు మనోజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే కాక.. తన అన్న పెర్ఫామెన్స్‌ను కొనియాడుతూ పోస్టు పెట్టాడు. ఇటీవల ‘మిరాయ్’ సినిమాకు మంచు విష్ణు విష్ చేయడంతో ఇద్దరి మధ్య మరింత దూరం తగ్గినట్లు అనిపించింది. ఇప్పుడు ‘మిరాయ్’ సక్సెస్ మీట్లో మంచు మనోజ్.. తన అన్న గురించి ప్రస్తావించడం మంచు అభిమానులకు గొప్ప ఉపశమనం.
ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మనోజ్ ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఐతే అది మామూలుగా జరగలేదు. ప్రభాస్ తమ అన్నదమ్ములిద్దరికీ సాయం చేశాడని పేర్కొంటూ రెబల్ స్టార్‌కు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. ప్రభాస్.. ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నతో కలిపి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు మనోజ్.
విష్ణు పేరు ఎత్తకపోయినా.. అన్నను కలుపుకొని మాట్లాడాడంటే గొడవలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడ్డట్లే అని భావిస్తున్నారు. అదే సమయంలో మనోజ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అతను తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టాడన్నాడు. తన పిల్లల్ని తాను పెరిగినట్లుగా పెంచగలనా లేదా అనే భయం తనలో ఉండేదని.. ఆ భయాన్ని కార్తీక్ చంపేశాడని.. కెరీర్ పట్ల తనకు ఈ సినిమా ఎన్నో ఆశలు రేకెత్తించిందంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వ్యాఖ్యానించాడు మనోజ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates