ఇళయరాజాకు మళ్లీ కోపమొచ్చింది

ఫలానా చిత్ర బృందంపై ఇళయరాజా ఆగ్రహం.. లీగల్ నోటీసులు ఇచ్చిన ఇళయరాజా.. తన పాటలు అనుమతి లేకుండా వాడినందుకు కోర్టుకు ఇళయరాజా.. గత కొన్నేళ్లుగా ఇలాంటి వార్తలు తరచుగా చూస్తున్నాం. మ్యూజిక్ కన్సర్టుల్లో తన పాటలు వాడినా ఆయన ఒప్పుకోవట్లేదు. తన ఆప్తమిత్రుడైన దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సైతం ఆయన లీగల్ నోటీసులివ్వడం అప్పట్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఎవరు ఏ రకంగా తన పాట వాడినా రాయల్టీ ఇవ్వాల్సిందే అని ఇళయరాజా అంటున్నారు. తన మీద అభిమానంతో ఎక్కడైనా తన పాట, బీజీఎం వాడినా ఆయన ఊరుకోవట్లేదు. లీగల్ నోటీసులు ఇస్తున్నారు. లేదంటే కోర్టులో కేసులు వేస్తున్నారు.

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ టీం మీద ఇలాగే కోర్టులో పోరాడి నష్టపరిహారం కూడా ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఇళయరాజా.. ఓ పెద్ద సినిమా మేకర్స్ మీద కోర్టుకెక్కారు. తమిళంలో టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా ఈ ఏడాది వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీం మీద ఇళయరాజా కోర్టులో కేసు వేశారు. ఈ చిత్రంలో అక్కడక్కడా ఇళయరాజా పాటలు వినిపిస్తాయి.

సినిమా చూసిన వాళ్లకు అది ఇళయరాజా మీద అభిమానంతోనే అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆయన మాత్రం ఉద్దేశం ఏదైనప్పటికీ.. తన అనుమతి లేకుండా వర్క్ ఏ రకంగానూ వాడుకోవడానికి వీల్లేదనే అంటున్నారు. ఆయన మద్రాసు హైకోర్టులో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీం మీద కేసు వేశారు. సినిమా నుంచి తన పాటలు తీసేయడంతో పాటు.. తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఇళయారాజా డిమాండ్ చేశారు. సెప్టెంబరు 8న ఈ కేసు విచారణకు రానుంది. తమిళంలో అజిత్ పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఇళయరాజా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన అందరి విషయంలోనూ ఒకే రూల్ పాటిస్తున్నారు. బాలుకే నోటీసులు పంపించిన ఇళయరాజా.. అజిత్‌ను మాత్రం ఎలా వదిలేస్తారు?