రజనీకాంత్ క్లాస్ తీసుకోవడం రైటే

ఇటీవలే చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలుసుకున్న మంచు మనోజ్ తాను విలన్ గా చేసిన మిరాయ్ ట్రైలర్ ని ప్రత్యేకంగా చూపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తిరిగాయి. ఈ సందర్భంగా రజని తనను తిట్టారని, సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావని క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు మనోజ్. మోహన్ బాబుతో ఉన్న ఘాడమైన స్నేహం దృష్ట్యా ఫ్రెండ్ కొడుక్కి ఆ మాత్రం మంచి చెడ్డ చెప్పే హక్కు ఖచ్చితంగా తలైవర్ కు ఉంది. అందులోనూ మిరాయ్ లాంటి గ్రాండియర్ లో భాగమవ్వడం చూశాక ఖచ్చితంగా అలా చెప్పకుండా ఎలా ఉంటారు. ఆ విషయాన్ని మనోజ్ స్వయంగా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

రజని అన్నారని కాదు కానీ మనోజ్ నిజంగానే కెరీర్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాలి. భైరవం, మిరాయ్ లో విలన్ గా నటించినా సరే ఇప్పటికీ సోలో హీరోగా తనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే ఒక అనౌన్స్ మెంట్ రాగా మరొకటి వచ్చే నెల రెడీ చేస్తున్నారు. మార్కెట్ పరంగా చూసుకుంటే మనోజ్ కు ఎప్పుడో పట్టు తగ్గింది. కానీ ప్రేక్షకుల్లో తన మీద ఉన్న సదభిప్రాయం, యూత్ లో ఉన్న గుర్తింపు అవకాశాలు వచ్చేలా చేస్తోంది. దాన్ని సరైన రీతిలో వాడుకోవడమే మిగిలింది. మిరాయ్ ఫాంటసీ సబ్జెక్టు కాబట్టి విలన్ కోణంలో చాలా పెద్ద స్కోప్ దక్కినట్టు ఇన్ సైడ్ టాక్.

మంచు ఫ్యామిలీలో వరసగా సినిమాలు చేస్తున్న వాళ్ళు లేరు. మోహన్ బాబు చాలా సెలెక్టివ్ గా మారిపోయారు. విష్ణు కన్నప్ప కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఆశించిన ఫలితం పూర్తి స్థాయిలో దక్కలేదు. కొత్త ప్రాజెక్టు ఇంకా అనౌన్స్ చేయలేదు. లక్ష్మిప్రసన్న సైతం అడపాదడపా తప్ప కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మనోజ్ కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది అసలే టాలీవుడ్ లో విలన్ల కొరత చాలా ఉంది. ఇక్కడి వాళ్ళు సరిపోక బాలీవుడ్ నుంచి భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి దింపాల్సి వస్తోంది. మనోజ్ లాంటి వాళ్ళు ఊపందుకుంటే ఆ లోటు కొంతైనా తీరుతుంది. అందుకే రజనీకాంత్ క్లాస్ పీకడం రైటే.