తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ వయసు ప్రస్తుతం 48 ఏళ్లు. ఇంత వయసుకు కానీ అతను పెళ్లికి రెడీ అవ్వలేదు. పదేళ్ల ముందే అతడి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ వరలక్ష్మి శరత్ కుమార్‌తో పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారానికి బ్రేక్ పడింది. తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ అనీషా రెడ్డితో అతను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ అది కూడా రద్దయింది. ఎట్టకేలకు విశాల్ పెళ్లికి రంగం సిద్ధమైంది.
తమిళ నటి సాయి ధనుష్కతో అతను తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. విశాల్ పుట్టిన రోజు నాడే వీరి నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా లేకుండా ఆ రోజు నేరుగా పెళ్లే చేసుకుందామని ఈ జంట అనుకుందట. కానీ దశాబ్దం కిందట పెళ్లి విషయంలో తనకు తాను ఒక షరతు విధించుకున్నాడు విశాల్. ఆ షరతును అనుసరించే ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.
విశాల్ నడిగర్ సంఘానికి తొలిసారి కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో.. సంఘం కోసం భవనాన్ని నిర్మించాక అందులోని కళ్యాణమండపంలోనే తన పెళ్లి జరుగుతుందని ప్రకటించాడు. ఇప్పటికి తొమ్మిదేళ్లు గడిచాయి. అనేక ప్రయత్నాల తర్వాత కొన్నేళ్ల కిందటే ఆ భవన నిర్మాణం మొదలైంది. ఇప్పుడు అది చివరి దశలో ఉంది. ఇంకో రెండు మూడు నెలల్లో ఆ భవనం అందుబాటులోకి వస్తుందట.
ఇంత కాలం ఎదురు చూసిన తాను.. ఆ కొన్ని రోజులు ఎదురు చూడలేనా అనుకుని తన పుట్టిన రోజు నాటికి అనుకున్న పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. నిశ్చితార్థంతో సరిపెట్టాడు. నడిగర్ సంఘం కోసం భవనం నిర్మిస్తానన్న హామీని నిలబెట్టకుని, తన పంతం ప్రకారం అందులో తొలి పెళ్లిగా తనదే చేసుకోబోతున్నాడు విశాల్. విశాల్ ఈ హామీ ఇచ్చినపుడు అతను పెళ్లి చేసుకోవాలనుకున్నది వరలక్ష్మి శరత్ కుమార్‌ను. కానీ ఇప్పుడు సాయి ధనుష్కతో తన పెళ్లి కాబోతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates