తమ్ముడు ఒకవేళ హిట్టయ్యుంటే ఈపాటికి ఎల్లమ్మని నితిన్ తో మొదలుపెట్టేవారు నిర్మాత దిల్ రాజు. కానీ అది ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో అందరి నమ్మకాలూ తలకిందులయ్యాయి. దీనికి ప్రధాన బాధ్యత దర్శకుడు వేణు శ్రీరామ్ దే అయినా బాధితులు మాత్రం అందరయ్యారు. న్యాచురల్ స్టార్ నాని దగ్గరికి వెళ్లి ఒక్క సిట్టింగ్ లో నచ్చేలా చేసిన దర్శకుడు వేణు యెల్దండి దీని స్టార్ హీరోతో చేయాలనే సంకల్పంతో బలగం తర్వాత ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వకుండా రెండేళ్లకు పైగా వెయిటింగ్ లో ఉన్నాడు. నాని లైనప్ బిజీగా ఉండబట్టి నో అన్నాడు కానీ లేదంటే నితిన్ దాకా వచ్చేది కాదని ఇన్ సైడ్ టాక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఎల్లమ్మ హీరో మారబోతున్నాడు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా చర్చలైతే జరుగుతున్నాయట. సోషల్ మీడియాలో శర్వానంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ వర్కౌట్ కాని పక్షంలో మరో తమిళ స్టార్ హీరోని కూడా లైన్ లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. పేపర్ మీదే డెబ్భై కోట్లకు పైగా బడ్జెట్ డిమాండ్ చేస్తున్న ఎల్లమ్మని దిల్ రాజు చాలా ఇష్టపడ్డారు. సరైన ఇమేజ్ ఉన్న హీరో పడితే ఎక్కడికో వెళ్తుందనేది ఆయన నమ్మకం. దీనికి సదరు హీరో ట్రాక్ రికార్డు, థియేటర్ బిజినెస్, ఓటిటి మార్కెట్ ఇవన్నీ చాలా కీలకం.
పరస్పర అంగీకారంతోనే ఎల్లమ్మ నుంచి నితిన్ వేరయ్యాడని తెలిసింది. అందుకే విక్రమ్ కుమార్ తో వెంటనే స్వారీకి సంబంధించిన పనులు వేగవంతం చేశాడట. తెరవెనుక ఇంత జరుగుతోందంటే ఎల్లమ్మ ఆషామాషీ కంటెంట్ లా కనిపించడం లేదు. యూనిట్ లీక్ ప్రకారం ఇది పీరియాడిక్ సెటప్ లో జరిగే వయొలెంట్ లవ్ స్టోరీ. ఒళ్ళు గగుర్పొడిచే స్థాయిలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయట. ముఖ్యంగా హీరోయిన్ పెర్ఫార్మన్స్ చాలా కీలకం కాబోతోందని అంటున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు పరిశీలనలో పెట్టారని టాక్. చూడాలి మరి ఫైనల్ గా ఎల్లమ్మ ఎవరికి చేతికి వెళ్తుందో, ఎవరు దక్కించుకుంటారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates