నేచురల్ స్టార్ నాని కెరీర్ కొంత కాలంగా అనుకున్నంత ఆశాజనకంగా సాగట్లేదు. గత కొన్నేళ్లలో ‘జెర్సీ’ మినహాయిస్తే అతడికి పెద్ద హిట్ లేదు. అయితేనేం.. తన ప్రతి సినిమాతోనూ నాని చూపిస్తునన వైవిధ్యం, అభిరుచి, ప్రేక్షకుల్లో రేకెత్తిస్తున్న ఆసక్తి ప్రత్యేకమైంది. తన ప్రతి సినిమాతో ఏదో కొత్తగా చేయాలని అతను ప్రయత్నిస్తుండటం గమనించవచ్చు. కొత్తదనం కోసం అతను పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే.
చివరగా నాని నుంచి వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సంగతే తీసుకుంటే అది వైవిధ్యమైన సినిమానే. ఆ సినిమా ప్రోమోలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో.. ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల ఎంత ఆసక్తి కలిగిందో తెలిసిందే. సినిమాలో కొన్ని లోపాల వల్ల తేడా అయింది కానీ.. అది హిట్టవ్వాల్సిన సినిమానే. ఐతే ఈ సినిమా రిజల్ట్ తేడా అయినా సరే.. నాని తన ప్రయోగాలు, కొత్తదనం కోసం ప్రయత్నాలు ఆపట్లేదు.
‘ట్యాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో అతను చేయబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్.. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ ఎంత వైవిధ్యంగా కనిపించాయో తెలిసిందే. వైవిధ్యం కోరుకునే ప్రతి ప్రేక్షకుడినీ అరెస్ట్ చేసేలా కనిపించింది కాన్సెప్ట్ పోస్టర్. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమా టైటిల్‌తోనే మార్కులు కొట్టేసింది. ‘టక్ జగదీష్’ అనే పేరే సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.
ఇప్పుడిక ‘అంటే సుందరానికీ’ అనే సినిమాను ప్రకటించాడు నాని. దీని కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ వావ్ అనిపించేసిందంతే. మన ఫిలిం మేకర్లకు పెద్దగా పట్టని అంశంపై నాని-వివేక్ ఆత్రేయ దృష్టి పెట్టినట్లుంది. మన భాష, సంస్కృతిలో ఉన్న మాధుర్యమేంటో ఇందులో చూపించబోతున్నట్లే ఉంది. సుందరం అన్నది ఒకప్పటి రోజుల్లో పాపులర్ పేరు. మోషన్ పోస్టర్లో వినిపించిన మాటలు, కనిపించిన సెటప్ అంతా మనల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లి అప్పటి కల్చర్‌లో ఉన్న అందం ఏంటో చూపించేలాగే ఉన్నారు. మోషన్ పోస్టర్ చూడగానే అచ్చమైన తెలుగు సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలిగింది.
మన భాషను, సంస్కృతిని అమితంగా ఇష్టపడేవాళ్లందరూ ఫిదా అయిపోయేలా చేసిందీ అనౌన్స్మెంట్. నాని అభిరుచి ఏంటన్నది మరోసారి రుజువైందీ సినిమా ప్రకటనతో. అభిరుచి అనే కాదు.. ఏదో కొత్తగా చేయాలని తపించే విషయంలో నానికి మరే హీరో కూడా సాటి రాడు అంటే సందేహం లేదు.