వివాదాస్పద స్టేట్మెంట్లతో మార్కెటింగ్ చేస్తున్నారు

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన కొత్త సినిమా మదరాసి ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలు వివాదానికి దారి తీస్తున్నాయి. తన సామర్ధ్యం తగ్గలేదని అర్థం వచ్చే రీతిలో ఫెయిల్యూర్స్ కి హీరోలను కారణం చేయడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ రాత్రి 8 తర్వాతే షూటింగ్ కు వచ్చే వారని, దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందని, అదే దక్షిణాదిలో ఉదయమే మొదలుపెడతామని, సికందర్ ఫ్లాప్ కి బాధ్యుడిని నేను కాదనే రీతిలో చెప్పడం కండల వీరుడి అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పుకోవాల్సి ఉందని, ఫ్లాపయ్యాక ఈ కబుర్లు ఎందుకని నిలదీస్తున్నారు.

దర్బార్ ప్రస్తావన వచ్చినప్పుడు సైతం మురుగదాస్ కవరింగ్ ఓ రేంజ్ లో ఉంది. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేసిన టైం కావడంతో ఆ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ ఫోర్సులు సినిమాని దూరం పెట్టాయని, దాని వల్ల నెగటివ్ క్యాంపైన్ జరిగిందని వివరణ ఇచ్చారు. అంతే తప్ప దర్బార్ ఎందుకు అందరూ మెచ్చేలా తీయలేకపోయాననేది ఒప్పుకోలేదు. వెయ్యి కోట్ల సినిమాలు ఎంటర్ టైన్మెంట్ దర్శకులు తీస్తారని కానీ కోలీవుడ్ డైరెక్టర్లు మాత్రం ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నారని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ కి దారి తీసింది. మదరాసి కథ ఏడేళ్ల క్రితమే షారుఖ్ ఖాన్ కి చెప్పాడట.

ఒకప్పుడు చిరంజీవి, అమీర్ ఖాన్, సూర్య, రజనీకాంత్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు తీసిన మురుగదాస్ పూర్తిగా విరుద్ధమైన స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలవడం విచిత్రం. శివ కార్తికేయన్ హీరో అయినప్పటికీ మదరాసి మీద ఇంకా ఆశించిన స్థాయిలో బజ్ లేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద టీమ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ డ్రామాతో ఖచ్చితంగా హిట్టు కొడతానని మురుగదాస్ నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగ్గట్టు కంటెంట్ ఉంటే ఓకే. లేదంటే వరస హిట్లతో ఊపు మీదున్న శివ కార్తికేయన్ కు తొలి షాక్ కొట్టడం ఖాయం.