చివరి ఘట్టానికి చేరుకున్న ‘చిరు’ రాయబారం ?

రెండు వారాలకు పైగా షూటింగులను ఆపేసిన ఫెడరేషన్ సమ్మె వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి నిర్మాతలు, కార్మిక నాయకులతో వేర్వేరుగా సమావేశాలు జరిపి సమస్యలను సావధానంగా విన్నారు. నిన్న ప్రొడ్యూసర్లతో ఇవాళ ఫెడరేషన్ లీడర్లతో మీటింగులు పూర్తయ్యాయి. వాటి తాలూకు వీడియో విజువల్స్ బయటికి వచ్చాయి కానీ ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఇవాళ సుమారు డెబ్భైకి పైగా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడిన చిరంజీవి వేతనాల పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని నిర్మాతలు ఇచ్చిన సమాచారంతో క్రోడీరించే పనిలో ఉన్నారట.

మంగళవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య మరోసారి సమావేశం జరగనుంది. చిరంజీవి ప్రతిపాదించిన విషయాల మీద రెండు వర్గాలు మాట్లాడుకోబోతున్నాయని టాక్. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరితే ప్రెస్ మీట్ పెట్టి సమ్మె విరమణతో పాటు వేతనాల పెంపు, ప్రొడ్యూసర్ల ప్రతిపాదనలు అన్నీ వివరించి తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తారని తెలిసింది. సానుకూల ఫలితం వస్తే కనక చిరంజీవి అతిథిగా ఈ మీడియా మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఒకవేళ కంక్లూజన్ రాకపోతే మళ్ళీ సమ్మె కొనసాగించడం గురించి ఫెడరేషన్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

వీలైనంత త్వరగా ఇది ముగిసిపోవాలని పరిశ్రమ మొత్తం కోరుకుంటోంది. ఇప్పటికే ఆగిపోయిన షూటింగ్స్ వల్ల ఆర్టిస్టుల కాల్ షీట్లు, స్టూడియోలలో సెట్ల అద్దెలు, అవుట్ డోర్ లో తీసుకున్న ప్రాపర్టీల రెంట్లు, రోజు వారి అడ్వాన్సులు అన్నీ వృథాగా పోతున్నాయి. ఇంకోవైపు జీతాలు ఆగిపోయి కార్మికులు సైతం తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇది ఉభయులకూ నష్టమే చేస్తుండటంతో ఆ దిశగా ఆలోచించమని చిరంజీవి సూచించారట. తన వంతుగా కొన్ని పరిష్కారాలు ఇచ్చారు కానీ అవి నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు  కలిసి ఓకే అనుకుంటే శుభవార్త వినొచ్చు. ఏదైనా రేపు రాత్రి లోపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.