నిర్మాత నెత్తిన చీర వేసిన వేటూరి

అది ప్రేమయుద్ధం షూటింగ్ జరుగుతున్న సమయం.. నాగార్జున అమల హీరో హీరోయిన్లు.. గిరిబాబు భారతి.. మోహన్ బాబు మిగతా తారాగణం.. దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు.. సంగీతం హంసలేఖ..

నేను వేటూరి గారితో పాటలు రాయించుకోవడానికి వెళ్ళేవాడిని.. ఒక పాట కోసం ట్యూన్ వున్న చిన్న శాన్యో టేప్ రికార్డర్.. ఒక ప్యాడ్.. ఖర్చులకు కొంత డబ్బు.. ఇవి తీసుకుని ఉదయాన్నే 8గంటలకల్లా విజాయాగార్డెన్ చేరుకుంటే గురువుగారు 8.15.. 8.30 లోపు వచ్చేవారు..

అప్పటికే అక్కడ మరొ ఇద్దరు అసోసియేట్ డైరక్టర్లు ప్యాడ్. టేప్ రికార్డ్స్ తో రెడీ గా ఉండేవారు.. ముగ్గురికీ పాట అర్జెంట్ గానే కావాలి.. కానీ గురువుగారు ఆ రోజు ఎవర్ని కారు ఎక్కమంటే వారే ఎక్కాలి.. ముగ్గురూ ఆయనకి బాగా పరిచయం వున్నవాళ్ళమే.. కానీ ఆయన మూడ్ ఎవరి మీద పడితే వాళ్ళు కారు ఎక్కాలి.. కానీ మిగతా ఇద్దర్నీ నొప్పించకుండా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళని కూడా వొప్పించేవాడు…

కారు బయలుదేరాక పోనీయమనేవాడు డ్రైవర్ తో..డ్రైవర్ పోతూ ఉంటాడు.. సడన్ గా డ్రైవర్ కి చెప్పి ఒక చోటికి వెళ్ళమని ఒక పేరు చెబుతాడు.. అక్కడికి వెళ్ళాక డ్రైవర్ దిగి ఆ ఇంట్లో కి వెళ్లి వస్తాడు.. వెంటనే గురువుగారు దిగబోతుంటే వారించి నేనే కార్ లోనుంచి బయటకు వచ్చి దూరంగా నిలబడేవాడిని.. ఆ వ్యక్తి గురువుగారితో కాసేపు మాట్లాడి చిరునవ్వుతో వెళ్లిపోయేవాడు.. నాకు ఏమీ అర్ధం అయ్యేది కాదు.. తరవాత హోటల్ తాజ్ కోరమాండల్ కి పోనివ్వమనేవాడు.. అక్కడ వేటూరి గారిపేరుతో ఒక రూమ్ ఉండేది.. కాఫీ లు టీలు ఏదైనా ఆర్డర్ చెస్తే నిమిషాల్లో వచ్చేది.. ఎందుకంటే గురువుగారంటే వారందరికీ ప్రత్యేకమైన అభిమానం..

ఈ లోపు బోలెడన్ని కబుర్లు.. సాహిత్యానికి సంబందించినవి.. హాస్యానికి సంబందించినవి చెబుతూవుండేవారు.. లంచ్ టైం లో భోజనం ఆర్డర్ చేసేవారు… (వేరే రైటర్స్ అయితే మొత్తం ప్రొడ్యూసర్ అకౌంట్ లోకే.. ఈయన రూమ్ రెంట్ తో సహా మొత్తం తానే పే చేసేవాడు ).. కాసేపు నడుం వాల్చి లేచి ఒక టీ తాగి… ఏదీ ఆ గంగరాజు (ఆయన ఉద్దేశ్యం లో అది హంసలేఖ పెరు) ఇచ్చిన ట్యూన్ ఒకసారి వెయ్ అనేవారు… రెండు సార్లు విని ఆలోచించే లోపు రూమ్ లో ఫోన్ మోగేది.. నన్ను తీయమనేవారు.. అవతలి నుండి వేరే కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్.. ఈయన మైమ్ లో చెప్పేవారు.. లేరని చెప్పమని.. వెంటనే ఆ హోటల్ నుండి వెంటనే అడయార్ గెట్ హోటల్ కి వెళ్ళేవాళ్ళం… అక్కడా అంతే మర్యాదలు..

ఇప్పడు టాపిక్ మా డైరెక్టర్ మీదకి.. అంటే రాజేంద్రసింగ్ బాబు గురించి.. ఏవిటి అతగాడు ఇంకో సినిమా తీస్తున్నాడట. మీ ప్రొడ్యూసర్ సాంబశివరావు చెప్పాడు.. అంటే నేను అవును గురువు గారూ.. కన్నడలో చాలా పెద్ద బడ్జెట్ తో తీస్తున్నాడు.. దాని పేరు ‘ముత్తిన హార’ అన్నాను.. ఆయన వెంటనే ఇలా అన్నాడు…’ రాజేంద్రసింగ్ బాబు ముత్తిన హార.. కాదది సాంబశివరావు నెత్తిన చీర’ అని.. అది ఆయన హాస్య చతురత..

ఇంతా చెస్తే ఆయన పాట రాయడానికి పట్టే టైం మాత్రం 5నిమిషాలే.. అప్పుడు రాసిన పాటే ‘స్వాతీముత్యపు జల్లులలో.. శ్రావణమేఘపు జావళిలో’..ప్రేమయుద్ధం లో ఒక సూపర్ హిట్ సాంగ్.. … ‘…..తరవాత నేను ఇంకో కొడైరక్టర్ ని అడిగేతే అతను చెప్పింది ఏమిటంటే… (హోటల్ కి వచ్చేముందు కార్ పక్కన నిలబడి మాట్లాడిన వ్యక్తి గురించి తెలిసిన సమాచారం).. అది రుణానందలహరి అని.. అప్పిచ్చువాడు వైద్యుడు అని.. అతను అలాంటి ఒక అప్పిచ్చిన వైద్యుడు అని….

— శివ నాగేశ్వర రావు