కూలీ పాట చూసిన మోనికా బెలూచి

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’కి మంచి హైప్ తీసుకురావడంలో ‘మోనికా’ పాట కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. సూపర్ హాట్ లుక్స్, స్టెప్పులతో ఈ పాటలో పూజా హెగ్డే అదరగొట్టేసింది. సౌబిన్ షాహిర్ సైతం ఈ పాటలో బాగా హైలైట్ అయ్యాడు. ఇక అనిరుధ్ తన మ్యూజిగ్, వాయిస్ రెంటితోనూ మ్యాజిక్ చేశాడు. సుభాషిణి అనే సింగర్ ఈ పాటను పాడిన తీరు వేరే లెవెల్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ పాట ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది. 

ఇది ఇటాలియన్ లెజెండరీ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌గా ఈ పాటను సినిమాలో పెట్టాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అనిరుధ్‌కు సైతం ఆమె మీద ఆరాధన భావం ఉండడంతో దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఈ పాట ఏకంగా మోనికా బెలూచి దగ్గరికి చేరడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా వెల్లడించారు. ‘కూలీ’ సాంగ్ మోనికాకు చేరడంలో ఆమెనే కీలక పాత్ర పోషించారు. మోనికాకు పరిచయం ఉన్న ఒక ఫిలిం ఫెస్టివల్ హెడ్‌కు అనుపమ ఈ పాటను షేర్ చేశారట. ఆ వ్యక్తి.. మోనికాకు పాటను షేర్ చేశారట. ఈ పాట మోనికా బెలూచికి బాగా నచ్చినట్లు తిరిగి మెసేజ్ అనుపమకు వచ్చిందట. 

పూజా హెగ్డేతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అనుపమ వెల్లడించారు. ఇది తెలిసి పూజా షాక్ అయింది, ఎంతో ఎగ్జైట్ అయింది. మోనికా అంటే తనతో పాటు టీం అందరికీ ఎంతో ఇష్టం అని.. ఆమె మీద అభిమానంతో చేసిన పాట తన వరకు చేరడం, ఆమెకు నచ్చడం చాలా సంతోషంగా ఉందని పూజా చెప్పింది. ఈ పాట రిలీజైన దగ్గర్నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మోనికాను ట్యాగ్ చేయడం, కూలీ సినిమా చూడమని అడగడం గమనించానని.. ఆమె మీద చేసిన పాట తన వరకు చేరడం చాలా హ్యాపీ అని పూజా వ్యాఖ్యానించింది.