సీనియర్ హీరోల పక్కన జూనియర్ హీరోయిన్లు నటించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు మనవరాలి పాత్ర పోషించిన శ్రీదేవే.. కాల క్రమంలో ఆయన పక్కన కథానాయికగా చేశారు. ఐతే సోషల్ మీడియా లేనపుడు ఇలా ఎవరితో ఎవరికి జోడీ కట్టించినా చెల్లిపోయింది కానీ.. ఇప్పుడు మరీ వయసు అంతరం ఉన్న హీరోయిన్‌తో ఒక హీరో జోడీ కడితే.. నెటిజన్లు ఊరుకోరు. జోడీ ఆడ్‌గా అనిపిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల.. కెరీర్ ఆరంభంలో రవితేజ పక్కన కథానాయికగా నటిస్తే.. విమర్శలు తప్పలేదు.
రవితేజ పక్కన మరీ చిన్నపిల్లలా ఉందంటూ కౌంటర్లు పడ్డాయి. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ధమాకా’ పెద్ద హిట్టవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. శ్రీలీల కథానాయికగా పరిచయమై ఐదారేళ్లు గడిచిపోయినప్పటికీ.. ఇంకా ఆమెలో అయితే టీనేజీ ఛాయలు పోలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోల పక్కన ఆమె కొంచెం ఆడ్‌గా అనిపిస్తుందనే ఫీలింగే ఉంది. ఇప్పుడు ఆమె కొత్త సినిమా గురించి కబురు విన్నవాళ్లందరికీ.. ఆమె ఆ హీరో పక్కన సెట్టవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన అజిత్ సరసన శ్రీలీల నటించబోతోందట. అజిత్‌కు చాన్నాళ్ల తర్వాత ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రూపంలో హిట్ ఇచ్చిన ఆయన ఫ్యాన్ బాయ్ ఆధిక్ రవిచంద్రన్.. మళ్లీ తన అభిమాన కథానాయకుడితో జట్టు కట్టబోతున్నాడు. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా శ్రీలీలను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐతే ఈ సమాచారం బయటికి రాగానే.. అజిత్ పక్కన శ్రీలీల ఎలా సెట్ అవుతుంది.. లుక్స్ పరంగా కానీ, వయసు పరంగా కానీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. శ్రీలీ ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అదే.. పరాశక్తి. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అది పూర్తి కాకముందే దాన్ని మించిన పెద్ద సినిమా దక్కించుకోవడం బాగానే ఉంది కానీ.. అజిత్ పక్కన ఆమె సూటవుతుందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates