ఇదో బాలీవుడ్ దర్శకుడి నిజ జీవిత కథ. మాములుగా మనం సినిమాల్లో చూసే మాఫియా బెదిరింపులు చాలా తక్కువని రుజువు చేసే రియల్ బయోపిక్. అదేంటో చూద్దాం. రాజీవ్ రాయ్. హిందీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 1985లో ‘యుధ్’ అనే మల్టీస్టారర్ తో డైరెక్టర్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఇతనికి డెబ్యూ ఆశించిన ఫలితం అందించలేదు. నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుని 1989లో ముగ్గురు హీరోలను పెట్టి తీసిన ‘త్రిదేవ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. థియేటర్లు జనాలతో నిండిపోయి వసూళ్ల వర్షం కురిపించింది. 1992లో ‘విశ్వాత్మ’ అంచనాలు అందుకోలేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది.
1994లో ‘మోహ్రా’ కురిపించిన వసూళ్ల సునామి అంతా ఇంతా కాదు. రాజీవ్ రాయ్ టేకింగ్, మ్యూజిక్ టేస్ట్ గురించి సగటు మాస్ ఆడియన్స్ గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 1997 ‘గుప్త్’ మరో గొప్ప మలుపు. క్రైమ్ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ సూపర్ మూవీ బాబీ డియోల్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. రాజీవ్ రాయ్ ప్రస్థానం గమనించిన ముంబై మాఫియా బెదిరింపులకు దిగింది. ఫోన్ కాల్స్ తో హడలగొట్టింది. ఆఫీసుల మీద దాడులు చేయించింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సెక్యూరిటీ కల్పించినా ఆపలేకపోయారు. ఫలితంగా ఆయన ధ్యాస దెబ్బ తిని 2001లో ‘ప్యార్ ఇష్క్ మొహబ్బత్’ రూపం లో డిజాస్టర్ చూసారు.
2004 ‘అసంభవ్’ కూడా అదే ఫలితాన్ని అందుకుంది. దీంతో మాఫియాకు జడుసుకున్న రాజీవ్ రాయ్ ఇండియాకు గుడ్ బై చెప్పేసి తండ్రి, కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు. తిరిగి ఇటీవలే స్వదేశానికి వచ్చారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు స్వదేశానికి దూరంగా ఉన్నారంటే మాఫియా పుట్టించిన భయం ఆలా ఉండి పోయిందని, టి సిరీస్ గుల్షన్ కుమార్ హత్య చూశాక మరో ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు సినిమాలు తీసే పనిలో ఉన్నారు. ఏదేమైనా మాఫియా వల్ల ఒక బ్లాక్ బస్టర్ దర్శకుడు చాలా త్వరగా పరిశ్రమ నుంచి దూరం కావాల్సి రావడం మన తెరమీద దానికన్నా అతి పెద్ద ట్రాజెడీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates