మనోభావాలు ఇప్పుడెందుకు దెబ్బ తిన్నాయి

రిలీజైన అయిదు రోజుల తర్వాత తమిళనాడులో కింగ్డమ్ మీద వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకలోని వలస తమిళులను తప్పుగా చూపించారని, విలన్ కు మురుగన్ అనే పేరు కావాలని పెట్టారని, స్క్రిప్ట్ లో సున్నితమైన అంశాలు జొప్పించారని ఆరోపిస్తూ కొందరు నిరసనకారులు థియేటర్ల వద్ద ఉద్రిక్తతలు రాజేయడం హాట్ టాపిక్ గా మారింది. పలు చోట్ల బ్యానర్లు చించేయడం, దానికి ఒక రాజకీయ పార్టీ వత్తాసు పలకడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా ఇంత ఆలస్యంగా కింగ్డమ్ లో కంటెంట్ అభ్యంతరంగా కనిపించిందా అంటే తెరవెనుక కారణాలు పెరుమాళ్ళకెరుక.

కింగ్డమ్ పూర్తిగా శ్రీలంకలోని తమిళ వాదాన్ని తలెకెత్తుకోలేదు. కేవలం అక్కడి వెనుకబడిన వర్గాల కాన్సెప్ట్ ని అది కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీసుకుని దానికి హీరోయిజం, అన్నదమ్ముల సెంటిమెంట్ జోడించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అంతే తప్ప అబ్జెక్షన్ చేయాల్సినంత తీవ్రమైన కంటెంట్ లేదు. గతంలో మణిరత్నం అమృత, మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు. ఇటీవలే రిలీజైన శశి కుమార్ టూరిస్ట్ ఫ్యామిలీలోనూ ఈ పాయింట్ తీసుకున్నారు కానీ వాటికి ఎలాంటి కాంట్రవర్సి రాలేదు. కాకపోతే కింగ్డమ్ నే టార్గెట్ చేయడం పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఎంత దూరం వెళ్తుందనేది పక్కనపెడితే మనోభావాలు ఇంత ఆలస్యంగా మేలుకోవడం విచిత్రమే. నిజానికి చరిత్రను పక్కదారి పట్టించడం, లేనిపోనివి ఇరికించడం కింగ్డమ్ లో చేయలేదు. ఆ మాటకొస్తే ఒకవేళ నిజంగా ఫీలవ్వాల్సి వస్తే జాప్నాలో అంత క్రైమ్ ఉందని చూపించినందుకు శ్రీలంక పౌరులు అభ్యంతరం వ్యక్తం చేయాలి. అంత కాంట్రావర్సిగా అక్కడేం లేదు కాబట్టి ఇతర దేశాల్లో కింగ్డమ్ చూసిన తమిళ జనాలు వివాదం రేపలేదు. సరే గొడవలు చేసిన వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఈ రకంగా ఇదో స్పెషల్ ప్రమోషన్ గా కింగ్డమ్ తమిళ కలెక్షన్లకు ఉపయోగపడితే చాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.