మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తాను కంపోజ్ చేసిన సినిమాల విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఎమోజిలు పెడుతూ ఉంటాడు. వాటి ద్వారా మూవీ ఎంత పెద్ద హిట్టవుతుందో చెప్పడాన్ని ఫ్యాన్స్ సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ ట్రెండ్ ని అనిరుధ్ జైలర్ తో మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కు అది బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో అభిమానులు ఈ నమ్మకాన్ని మరింత పెంచుకున్నారు. దీంతో ఇతర నిర్మాతల నుంచి తమ రిలీజ్ టైంలో కూడా ఎమోజిలు పెట్టి హైప్ పెంచమని రిక్వెస్ట్ చేయడంతో కుర్రాడికి పెట్టక తప్పేది కాదు. తీరా చూస్తే ఫ్లాపులు పడుతున్న వైనం అనిరుధ్ కి ఇబ్బందిగా మారింది.
ఇదంతా అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎమోజిలు పెట్టడం వరకు బాగానే ఉంది కానీ, ఫెయిలవుతాయని తెలిసిన సినిమాలకు కూడా అలా పోస్ట్ చేయడం వల్ల తన తీర్పు తప్పుగా వెళ్తోందని చెప్పుకొచ్చాడు. అందుకే వాటిని పెట్టడం మానేశానని వివరించాడు. నిజానికి ఇండియన్ 2, విడాముయర్చి, వేట్టయన్ లాంటి వాటికి అనిరుధ్ పెట్టిన ట్వీట్లు దారుణంగా మిస్ ఫైర్ అయ్యాయి. మొహమాటానికి అతనవి పెడుతున్నట్టు మూవీ లవర్స్ కి అర్థమైపోయింది. అయితే కూలికి ఎమోజిలు అవసరం లేదని, పబ్లిక్ స్టేజి మీద చెబుతున్నాని, అంచనాలకు మించి అదిరిపోతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హామీ ఇచ్చాడు.
చూసేందుకు చిన్న విషయంలా కనిపించినా ఎమోజిల వ్యవహారం చాలా దూరమే వెళ్లిందన్న మాట. ఇదంతా పక్కనపెడితే అనిరుధ్ రేంజ్ బ్లాక్ బస్టర్ పడి బాగా గ్యాప్ వచ్చేసింది. దేవర తర్వాత మళ్ళీ తన మేజిక్ రిపీట్ కాలేదు. కూలి పాటలు బాగానే రీచ్ అయ్యాయి కానీ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మిశ్రమ స్పందనే వినిపించింది. ఫైనల్ కట్ లో ఏమైనా బెటర్ గా ఉంటుందేమో చూడాలి. ఆగస్ట్ 14 కూలితో పాటు విడుదల కాబోతున్న వార్ 2తో పోలిస్తే అన్ని విషయాల్లోనూ రజనీకాంత్ మూవీనే ముందంజలో ఉంది. టాక్ పాజిటివ్ తెచ్చుకుంటే కనక వసూళ్ల మోతతో బాక్సాఫీస్ ఊగిపోవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates