హోంబాలే సంస్థకు పోటీగా కెవిఎన్

కెజిఎఫ్, కాంతార సినిమాలతో శాండల్ వుడ్ స్థాయిని అమాంతం పైకెక్కించిన ఘనత హోంబాలే ఫిలిమ్స్ కు దక్కుతుంది. కన్నడ సినిమాలో ఇంత టాలెంట్ ఉందా అని ఇతర బాషల పరిశ్రమలు ఆశ్చర్యపోయేలా చేసింది వీళ్ళే. అందుకే ప్రభాస్ అడగ్గానే సలార్ చేశాడు. మరో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లు అడిగి మరీ వీళ్ళతో అసోసియేట్ అవుతున్నారు. ఇటీవలే మహావతార్ నరసింహతో యానిమేషన్ లోనూ జాక్ పాట్ కొట్టిన హోంబాలేకు కర్ణాటకకు చెందిన మరో బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్ గట్టి పోటీ ఇచ్చేలా తయారవుతోంది బెంగళూరు టాక్.

కెవిఎన్ కు పెద్ద ట్రాక్ రికార్డు లేదు. 2021లో గణేష్ హీరోగా సకత్ తో ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత బైటూ లవ్ అని మరో మూవీ చేశారు. రెండూ యావరేజే. నిర్మాణం కన్నా డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన కెవిఎన్ ఇప్పుడు బడా స్టార్లతో చేతులు కలుపుతూ పెద్ద ప్రోజెక్టులను సెట్ చేసుకుంటోంది. పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న విజయ్ జన నాయగన్ మీద వందల కోట్ల బడ్జెట్ పెట్టారు. యష్ టాక్సిక్ మీద పెడుతున్న ఖర్చు వింటున్న వాళ్ళు ఇప్పటికే నోరెళ్ళబెడుతున్నారు. ధృవ్ సర్జాతో తీసిన కేడి డెవిల్ లో సంజయ్ దత్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని పెట్టుకుని తీశారు.

వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కే యాక్షన్ ఎంటర్ టైనర్ వీళ్ళకే దొరికింది. ఖైదీ 2 తీయడానికి రేస్ లో వీళ్ళే ముందున్నారు. ఇవన్నీ కలుపుకుంటే సుమారు రెండు వేల కోట్ల దాకా బిజినెస్ లెక్కలు తేలేలా ఉన్నాయని బెంగళూరు మీడియా టాక్. ఇంత పెద్ద ఇన్వెస్ట్ మెంట్స్ తో దూసుకుపోతున్న కన్నడ ప్రొడ్యూసర్లలో హోంబాలే తర్వాత నెక్స్ట్ ఉన్నది కెవిఎన్ ప్రొడక్షన్సే. చిరంజీవి మూవీ కూడా ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో విశ్వంభరని మించే స్థాయిలో బడ్జెట్ ఉంటుందట. జానర్ తదితర వివరాలు తెలియలేదు కానీ ఆగస్ట్ 22 చిరు పుట్టినరోజు నాడు ప్రకటన రానుంది.