వీరమల్లుకి విషమ పరీక్ష నేటి నుంచే

పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. ప్రీమియర్స్ టాక్ వల్ల శుక్ర శనివారాలు నెమ్మదించినట్టు కనిపించినా ఆదివారం ఫుల్ స్వింగ్ లో మంచి వసూళ్ళు రాబట్టింది. వారాంతం అందులోనూ ఫస్ట్ వీక్ కాబట్టి ఈ మాత్రం పికప్ ఉండటం సహజమే కానీ ఎంత కలెక్షన్లు వచ్చాయనేది మెగా సూర్య ప్రొడక్షన్స్ వెల్లడించడం లేదు. మాములుగా ఫ్యాన్స్ కోసం ఈ నెంబర్లను పోస్టర్లలో హైలైట్ చేస్తూ వదులుతూ ఉంటారు. కానీ దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పిన దాని ప్రకారం చూస్తే అంకెలను వెల్లడించడానికి నిర్మాత ఏఎం రత్నం సుముఖంగా లేకపోయి ఉండొచ్చు.

ఇదిలా ఉండగా వీరమల్లు వీక్ డేస్ పెర్ఫార్మన్స్ చాలా కీలకం కానుంది. తెలంగాణలో దాదాపు పాత గరిష్ట ధరలను ఈ రోజు నుంచి అమలులోకి తెచ్చారు. ఏపీలో చాలా సెంటర్లలో జీవోకి ముందు రేట్లే పెట్టారని ట్రేడ్ టాక్. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత తగ్గించి పెంపుని కొనసాగిస్తున్నారని రిపోర్ట్. విఎఫెక్స్ గురించి కంప్లయింట్ వచ్చిన సీన్లను మార్చి, కొన్ని సన్నివేశాలను కుదిరించి, కొత్త వెర్షన్ ని రీ లోడ్ పేరుతో నిన్న షోల నుంచే ప్రదర్శిస్తున్నారు. వీటి కోసం ఫ్యాన్స్ మళ్ళీ ఎగబడి చూస్తారని చెప్పలేం కానీ పవన్ మూవీని ఒక్కసారైనా చూడాలనుకున్న ఫ్యామిలీ జనాల కోణంలో ఈ మార్పులు ప్లస్ కావొచ్చు.

గురువారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ వచ్చేస్తోంది. సితార సంస్థ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసుకుంది. దీని వల్ల హరిహర వీరమల్లు ఏ స్థాయిలో ప్రభావం చెందుతుందనేది టాక్ మీద ఆధారపడి ఉంటుంది. రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అంత మొత్తాన్ని సాధించడం దుర్భేద్యంగా కనిపిస్తోంది. టాక్ యునానిమస్ గా వచ్చి ఉంటే అసలీ డిస్కషన్ ఉండేది కాదు. కొత్త వెర్షన్ కు కొంచెం బెటర్ ఫీడ్ బ్యాక్ కనిపిస్తున్న నేపథ్యంలో అదేమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి. ఒకపక్క మహావతార్ నరసింహ వసూళ్లలో దూసుకుపోవడం వీరమల్లుకు స్పీడ్ బ్రేకర్ లా మారింది.