జూలై 23 రాత్రికి చీకటి ఉండదు

ఇవాళ టాలీవుడ్ కు బిగ్గెస్ట్ నైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక టయర్ 1 స్టార్ హీరో సినిమా ముందు రోజు రాత్రి ప్రీమియర్ వేయడమనేది ఒక్క పుష్ప 2కి తప్ప గత కొన్నేళ్లలో ఇంకెవరికీ జరగలేదు. అర్ధరాత్రి లేదా తెల్లవారుఝామున స్పెషల్ షో వేయడం మాములే కానీ ముందస్తు రిలీజ్ అంటే నిర్మాతకు చాలా రిస్క్ అవుతుంది. కానీ నిర్మాత ఏఎం రత్నం తీసుకున్న సాహసోపేత నిర్ణయం తగిన ఫలితాలే ఇస్తోంది. 700 రూపాయల టికెట్ అయినా సరే ఆన్ లైన్ ఉంచడం ఆలస్యం క్షణాల్లో అయిపోతున్నాయి. నేరుగా థియేటర్ల దగ్గర కొంటున్న అభిమానులు ప్రతి సెంటర్లో వందలు వేలల్లో ఉంటున్నారు.

రాత్రి 9 గంటల నుంచి షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని సెంటర్లలో షోలు పడుతున్నాయి. జిల్లా కేంద్రాలు, నగరాలు కనీసం అయిదు నుంచి పదిహేను మధ్య షో కౌంట్ కనిపిస్తోంది. బుకింగ్ యాప్స్ ఏది ఓపెన్ చేసినా తెరకు దగ్గరగా ఖాళీ సీట్లు కొన్ని తప్ప మిగిలినదంతా హౌస్ ఫుల్సే ఉంటున్నాయి. సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. థియేటర్ పరిసర ప్రాంతాలు ప్రీమియర్లకు ముందు, షోలు అయిపోయాక బాణాసంచా, డీజే సౌండ్లు, ఫ్యాన్స్ అల్లరితో నానా హడావిడి చేయబోతున్నాయి. ఒకరకంగా జూలై 23 రాత్రికి చీకటి ఉండనట్టే.

మాములుగా వేసే రాత్రి 1, తెల్లవారుఝామున 4 గంటల ఆటలు మాత్రం షెడ్యూల్ చేయలేదని సమాచారం. ప్రీమియర్ మిస్ అయినవాళ్లు నేరుగా ఉదయం 7 గంటల షో నుంచి చూసుకోవచ్చు. తెలంగాణలో మాత్రం ప్రీమియర్లకు సంబంధించి కొంత సందిగ్దత నెలకొంది. ఒక డిస్ట్రిబ్యూటర్, థియేటర్ చైన్ మధ్య ఏర్పడిన ఒప్పందాల ఇబ్బంది వల్ల స్క్రీన్ల కేటాయింపు ఆలస్యమవుతోందని సమాచారం. నైజామ్ లో జూలై 24 అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్పీడ్ గా నమోదవుతున్నాయి. ఇప్పుడు టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్. అది కనక పాజిటివ్ వస్తే మాత్రం వీరమల్లు రికార్డులకు ఆకాశమే హద్దవుతుంది.