శ్రీలీలకు మళ్ళీ చుక్కెదురు

అవకాశాలకు లోటు లేదు కానీ మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ శ్రీలీలకు బ్లాక్ బస్టర్ మాత్రం అందని ద్రాక్షగా మారిపోయింది. గత నాలుగేళ్లలో ధమాకా, భగవంత్ కేసరి మినహాయించి మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర నష్టాలు తెచ్చినవే. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కొట్టినవి. గుంటూరు కారం ఏదో మహేష్ ఇమేజ్ వల్ల కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది కానీ కంటెంట్ పరంగా అభిమానులు దాన్ని బెస్ట్ మూవీగా పరిగణించరు. శ్రీలీలకు దాని వల్ల కలిగిన ప్రధాన ప్రయోజనం కుర్చీ మడతపెట్టి పాటలో అదిరిపోయే స్టెప్పులతో మాస్ కు దగ్గర కావడం.

తాజాగా జూనియర్ కూడా ఈ లిస్టులో చేరిపోయినట్టే. మొదటి మూడు రోజులు కొంచెం హడావిడి చేసినా తర్వాత నెమ్మదించింది. తెలుగు వెర్షన్ కోసం హీరో కిరిటీ చాలా ప్రమోషన్లు చేసుకున్నాడు. రివ్యూలలో కుర్రాడికి మంచి మార్కులు పడ్డాయి. డాన్సుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. కానీ నటన, కంటెంట్ సెలక్షన్ మాత్రం ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. కన్నడలో జూనియర్ కొంచెం పర్వాలేదనిపించుకున్నా మొన్న రిలీజైన యువరాజ్ కుమార్ ఎక్కా దెబ్బకి బాగా డౌన్ అయిపోయింది. ఇక 24 నుంచి హరిహర వీరమల్లు వీరంగం ఉంటుంది కాబట్టి జూనియర్ సెలవు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

శ్రీలీలకు పాత్ర పరంగా ప్రాధాన్యం దక్కకపోవడం మరో లోటని చెప్పాలి. ముఖ్యంగా వైరల్ వయ్యారి పాటలో డాన్స్ సంగతి పక్కనపెడితే కిరిటీతో కెమిస్ట్రీ కాస్త ఎక్కువయ్యిందంటూ ట్విట్టర్ లో విసుర్లు కనిపించాయి. ఇప్పుడు శ్రీలీల నుంచి వస్తున్న తర్వాతి సినిమా మాస్ జాతర. రవితేజ హిట్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందేమో చూడాలి. అది కూడా ఎంతో దూరంలో లేదు. ఆగస్ట్ 27 రిలీజ్ కు రెడీ అవుతోంది. అసలైన బ్రేక్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ కూడా ఇవ్వాలని శ్రీలీల ఫాన్స్ కోరుకుంటున్నారు. వీటితో పాటు కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న బాలీవుడ్ డెబ్యూ, తమిళ తెరంగేట్రం పరాశక్తి తన కెరీర్ కు కీలకం కాబోతున్నాయి.