రోజూ భార్యకు పాద నమస్కారం చేసే నటుడు

భర్తకు భార్య పాద నమస్కారం చేయడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. ఏదైనా పూజలు చేసినపుడో, ఇంకేదైనా ప్రత్యేక సందర్భంలోనో భార్యలు ఇలా చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఇలాంటివి అరుదైపోయాయి. అలా ఆశించే భర్తలు తక్కువ. ఆ రకంగా చేసే భార్యలూ అరుదైపోయారు. ఐతే భార్యకు భర్త పాద నమస్కారం చేయడం అన్నది అరుదైన విషయం. శాస్త్రాలు ఆ విషయం చెప్పవు. భార్య మీద ప్రేమ, గౌరవంతో అలా చేసే వాళ్లను కూడా తక్కువగానే చూస్తాం. ఐతే పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ ఉన్న భోజ్‌పురి నటుడు రవికిషన్.. ప్రతి రోజూ తన భార్య పాదాలకు నమస్కారం చేస్తాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక టీవీ షోలో వెల్లడించడం విశేషం. 

‘రేసు గుర్రం’ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించిన రవి కిషన్‌.. బోజ్‌పురిలో సూపర్ స్టార్. ఆయనకు బాలీవుడ్లోనూ మంచి గుర్తింపే ఉంది. ఇటీవల కపిల్ శర్మ నిర్వహించే టీవీ షోలో పాల్గొన్న రవి కిషన్.. తన భార్యకూ రోజూ పాద నమస్కారం చేస్తానని వెల్లడించాడు. రవి కిషన్ తన చిన్న నాటి స్నేహితురాలైన ప్రీతిని వివాహం చేసుకున్నాడు. ఐతే సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ముందే తనకు పెళ్లి జరిగిందని.. తనకు ఏమీ లేని రోజుల్లో ప్రీతి తన వెంట నిలిచిందని రవి కిషన్ వెల్లడించాడు. 

తనకు పెద్ద కష్టాలు వచ్చినపుడు భార్యనే అండగా నిలిచిందని.. అందుకే ఇందుకు కృతజ్ఞతగా తాను ఆమెకు ఏం చేయగలనని ఆలోచించి ప్రతి రోజూ పాద నమస్కారం చేయడం మొదలుపెట్టానని రవి కిషన్ తెలిపాడు. ఐతే ఇది ఆమె నిద్ర పోయిన తర్వాత చేస్తానని అతను వెల్లడించాడు. తన భార్య పడుకోగానే పాదాలను తాకి ఆమెకు తన కృతజ్ఞతను తెలిపి ఆ తర్వాత తాను పడుకుంటానని రవి కిషన్ తెలిపాడు. అతనీ మాట చెప్పగానే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది. భార్య మీద ఇంత గౌరవ భావం ఉండడం ఒకెత్తయితే.. దాన్ని బహిరంగంగా అందరి ముందు చెప్పడం మరో ఎత్తు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.