తెరమీద హీరోలుగా కనిపించే వాళ్ళు నిజ జీవితంలో అలా ఉంటారనే గ్యారెంటీ లేదు. కొందరు మాత్రం తమ పరిధిలో సమాజానికి వీలైనంత సేవ చేసేందుకు తపిస్తూ ఉంటారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించే మహేష్ బాబు, బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా చిరంజీవి అందిస్తున్న సేవలు దీని కిందికే వస్తాయి. వీళ్ళే కాదు విజయ్ దేవరకొండ, సూర్య తదితరులు వీలైనంత తమ వంతు చేయూత వివిధ రూపాల్లో, ఫౌండేషన్ల ద్వారా చేస్తూనే ఉన్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ఈ లిస్టులో చేరాడు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 650 పైగా స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ చేయించడం ద్వారా వాళ్లకు అండగా నిలబడుతున్నాడు.
కొద్దిరోజుల క్రితం ఆర్య హీరోగా రూపొందుతున్న తమిళ సినిమా వెట్టవుమ్ షూటింగ్ లో స్టంట్ మాస్టర్ రాజు చనిపోయిన సంగతి తెలిసిందే. కారుని గాల్లో ఎగిరిస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం పట్టు తప్పి ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. దీనికి చలించిన అక్షయ్ కుమార్ స్టంట్ డిపార్ట్ మెంట్స్ లో పని చేసే ఒక్కొక్కరికి అయిదు నుంచి ఏడు లక్షల దాకా భీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేయించడం కదిలిస్తోంది. ప్రాణాలను రిస్కులో పెట్టి ఫైట్లు చేసేవాళ్లకు ఇలాంటి అండ చాలా అవసరం. ఇలాంటివి ఎప్పుడో ఎవరో చేసి ఉండాల్సింది కానీ అక్షయ్ ముందువరసలోకి వచ్చాడు.
అందరి దగ్గరా డబ్బుంటుంది కానీ దాన్ని నలుగురికి ఉపయోగపడేలా చేయడం కన్నా పుణ్యం వేరొకటి ఉండదు. నిజానికి హీరోలు తాము సంపాదించిన వందల కోట్లతో జనాలకు ఏదో చేయాలన్న నిబంధన లేదు. అది వాళ్ళ స్వార్జితం. కానీ తమ వంతు బాధ్యతగా స్టార్లు ఇలా ముందుకు వచ్చినప్పుడు ఫ్యాన్సే కాదు సగటు జనాలు కూడా మెచ్చుకుంటారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే తరహాలో ఇంకెవరైనా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి ఇన్సురెన్స్ లాంటివి చేయిస్తే లక్షల కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తాయి. ఈ దిశగా ఎవరైనా చొరవ తీసుకుంటారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates