ఏడు వందలకు పైగా సినిమాలతో అశేష అభిమానులను సంపాదించుకుని శాశ్వత నిద్రలోకి జారుకున్న కోట శ్రీనివాసరావు పాత్రల పరంగా సాధించనిది ఏదీ లేదు. కానీ ఒక్క లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. అదే స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి నటించడం. కోట ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఎన్టీఆర్ పరిశ్రమలో లేరు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అందుకే ఆ కలయిక సాధ్యం కాలేదు. 1987లో ప్రముఖ నటుడు డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మండలాధీశుడు వచ్చింది. అందులో టైటిల్ రోల్ పోషించింది కోట శ్రీనివాసరావే. భానుమతి రామకృష్ణ లాంటి సీనియర్లు అందులో ఉన్నారు.
కానీ ట్విస్ట్ ఏంటంటే మండలాధీశుడు కేవలం ఎన్టీఆర్ పాలనను, వ్యక్తిత్వాన్ని విమర్శించడానికి తీసిన సినిమా. అందుకే థియేటర్లలో ఫ్లాప్ అయ్యింది. కానీ కోట పెద్దవాళ్ళు అడిగారు కదాని నటించేశారు. కట్ చేస్తే టిడిపి, నందమూరి ఫ్యాన్స్ మండలాధీశుడు చూసి కోపంతో ఊగిపోయారు. ఓసారి రైల్వేస్టేషన్ లో కోట మీద దాడి చేయబోయారట. ఇంత జరిగినా ఎన్టీఆర్ దీన్ని సీరియస్ గా తీసుకోకుండా కోటని క్షమించారు. 1990లో ఎన్టీఆర్ తిరిగి మేకప్ వేసుకున్నాక బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవిసార్వభౌమ చేశారు. వీటిలో కోట శ్రీనివాసరావుకు అవకాశం దక్కలేదు. దర్శక నిర్మాతలు ఆఫర్ చేయలేదు.
ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ కోసం రాఘవేంద్రరావు నుంచి పిలుపు వచ్చినా డేట్ల సమస్య వల్ల కోట ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది. అదే అన్నగారి చివరి సినిమా అని తెలిసి ఉంటే వేరే నిర్ణయం తీసుకునేవారేమో. మండలాధీశుడు వివాదం వల్ల బాలకృష్ణ సినిమాలకూ కోట శ్రీనివాసరావు దూరమయ్యారు. 1992 రౌడీ ఇన్స్ పెక్టర్ ద్వారా ఈ గ్యాప్ ని దర్శకులు బి గోపాల్ పూడ్చారు. అప్పటి నుంచి కోట రెగ్యులర్ గా బాలయ్య కాంబోలో చాలా మూవీస్ చేశారు. ఎన్టీఆర్ తో మిస్సయినా జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, సింహాద్రి, టెంపర్, స్టూడెంట్ నెంబర్ వన్, రాఖీ లాంటి బ్లాక్ బస్టర్స్ లో కోట శ్రీనివాసరావు తెరను పంచుకోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates