కోర్ట్ అమ్మాయికి తమిళ ఛాన్స్

ఈ ఏడాది టాలీవుడ్లో పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘కోర్ట్’ మూవీనే. ఇందులో స్టార్లు లేరు. విడుదలకు ముందు ఈ సినిమాకు పెద్ద హైప్ కూడా లేదు. కేవలం కంటెంట్‌ను నమ్మి నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన అబ్బాయి హర్ష్ రోషన్, అమ్మాయి శ్రీదేవి ఇద్దరికీ చాలా మంచి పేరొచ్చింది. దాంతో పాటే అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్లున్నాయి.

శ్రీదేవి తెలుగులో కొన్ని క్రేజీ అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ వివరాలేవీ ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. ఈలోపే ఆమె ఓ తమిళంలో కథానాయికగా అవకాశం అందుకోవడం విశేషం. తమిళంలో కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తాను తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఎంచుకున్నాడు. రేగన్ స్టానిస్లాస్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభుదేవా సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

తమిళంలో సినిమాల ప్రారంభోత్సవాలకు టీంలో అందరికీ పూల మాలలు వేసి సత్కరిస్తారు. శ్రీదేవి కూడా ఇలా హీరో కమ్ నిర్మాతతో కలిసి పూల మాలతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తిరుగుతోంది. తమిళంలో మంచి మంచి రోల్స్ చేసి కథానాయికలుగా స్థిరపడ్డ తెలుగు అమ్మాయిలు చాలామందే ఉన్నారు. అంజలి, ఆనంది, శ్రీ దివ్య, కలర్స్ స్వాతి.. ఇలా చాలామంది తెలుగమ్మాయిలను ఆదరించింది తమిళ సినీ పరిశ్రమ. అక్కడ కథానాయికలకు ప్రాధాన్యమున్న పాత్రలే దక్కుతుంటాయి. శ్రీదేవికి కూడా మంచి రోల్ పడితే.. తన సీనియర్ల లాగే అక్కడ కథానాయికగా మంచి స్థాయికి వెళ్లే అవకాశముంది.