టాలీవుడ్లో ఆచితూచి సినిమాలు చేసే నటుల్లో అడివి శేష్ ఒకరు. ఒకప్పుడు చిన్న స్థాయి నటుడిగా ఉన్న శేష్.. ‘క్షణం’ దగ్గర్నుంచి అద్భుతమైన సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. శేష్ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే ధీమా ఇప్పుడు అందరిలోనూ ఉంది. అందుకే తనతో కలిసి పని చేయడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా అమితాసక్తి చూపుతుంటారు. అలాంటిది శేష్ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వీరి కలయికలో ‘డెకాయిల్’ సినిమా మొదలై కొంత చిత్రీకరణ కూడా జరుపుకుంది. కానీ తర్వాత చూస్తే.. శ్రుతి స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది.
మరి శ్రుతి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది అన్నది సస్పెన్సే. తాజాగా శేష్ ఈ సస్పెన్సుకి తెరదించాడు. శ్రుతి హాసన్ ‘కూలీ’ సహా కొన్ని చిత్రాల్లో నటిస్తోందని.. ఆ సినిమాల షెడ్యూళ్లకు, తమ చిత్రానికి క్లాష్ రావడం వల్లే శ్రుతి తప్పుకోవాల్సి వచ్చిందని అతను తెలిపాడు. తమ సినిమా కొంచెం ఆలస్యం కావడంతో శ్రుతి డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చిందని శేష్ తెలిపాడు.
ఇదేమీ ఘర్షణతో తీసుకున్న నిర్ణయం కాదని.. సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతోనే శ్రుతి ‘డెకాయిట్’ నుంచి తప్పుకుందని శేష్ తెలిపాడు. ఇప్పటిదాకా ‘డెకాయిట్’ చిత్రీకరణ 60 శాతం పూర్తయినట్లు అతను వెల్లడించాడు. గూఢచారి, వైల్డ్ డాగ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షనీల్ డియో ‘డెకాయిట్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శేష్ దీంతో పాటు ‘గూఢచారి’ సీక్వెల్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates