ఎల్లుండి హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఈసారి ఎలాంటి వాయిదా లేదు. జూలై 24 విడుదలలోనూ ఏ మార్పు ఉండదని, ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు పక్కా సమాచారం వెళ్లిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఏపీ తెలంగాణలో ఎంపిక చేసిన థియేటర్లలో భారీ సెలబ్రేషన్స్ మధ్య ట్రైలర్ లాంచ్ సంబరంగా జరుపుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి కొత్త ఉత్సాహంతో జనసేన వర్గాలు కూడా తోడవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా, అందులోనూ చాలా గ్యాప్ తర్వాత వస్తోంది కనక సెలబ్రేషన్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయి. పీఆర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ట్రైలర్ మీద వందల కోట్ల లెక్కలు ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే బజ్ తగ్గిపోయిన ఈ ప్యాన్ ఇండియా మూవీని ఒక్కసారిగా ఎలివేట్ చేయాల్సిన బాధ్యత ఈ వీడియో మీదే ఉంది. యూనిట్ సభ్యులు, ఇతర దర్శక నిర్మాతలు ప్రైవేట్ గా చూసి అద్భుతమని పొగుడుతున్నారు. అయితే ఆ మాట జూలై 3 కామన్ ఆడియన్స్ నుంచి వస్తే అప్పుడు అసలైన జాతర మొదలువుతుంది. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికీ వందల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. జూలై 24 టెర్రిఫిక్ ఓపెనింగ్ రావాలంటే మొదటి రోజే చూసి తీరాలనే కాంక్ష రగిలించేలా ట్రైలర్ కట్ ఉండాలి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో బెస్ట్ అనిపించాలి.
బిజినెస్ కు సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రావడం లేదు. తెలుగు రాష్ట్రాల కొన్ని ఏరియాలకు థియేట్రికల్ హక్కులను ఇంకా విక్రయించలేదని, ట్రైలర్ రాగానే ఈ వ్యవహారాలు ఊపందుకుంటాయని, భారీ రేట్లు వస్తాయని మెగా వర్గాలు ఆశిస్తున్నాయి. జనవరి తర్వాత ఇంకో టయర్ 1 హీరో సినిమా రిలీజ్ కానీ నేపథ్యంలో హరిహర వీరమల్లు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల సునామి చూడొచ్చు. దర్శకుడు జ్యోతికృష్ణ చాలా పెద్ద బరువే మోస్తున్నారు. కీరవాణి పాటలు అంతగా మేజిక్ చేయకపోవడంతో ఇప్పుడు భారమంతా మిగిలిన సినిమా మీద పడింది. సో జూలై 3 వీరమల్లు మొదటి అడుగు మీదే ఇప్పుడందరి దృష్టి.
Gulte Telugu Telugu Political and Movie News Updates