సీనియర్ హీరోయిన్ ‘మా’ మెప్పించిందా

ఇప్పటి జనరేషన్ కు అంతగా పరిచయం ఉండకపోవచ్చు కానీ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటే తెలుగులోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ తనకు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ఒకవేళ మెరుపు కలలు కనక సూపర్ హిట్ అయ్యుంటే సౌత్ లో జెండా పాతేదేమో కానీ ఛాన్స్ మిస్ అయ్యింది. ధనుష్ విఐపి 2 సోసోగా ఆడటం మైనస్సయ్యింది. కొంత కాలంగా నటనకే దూరంగా ఉన్న కాజోల్ టైటిల్ పాత్రలో మొన్న శుక్రవారం మా రిలీజయ్యింది. దీనికి భర్త అజయ్ దేవగనే నిర్మాత కావడం విశేషం.

హారర్ జానర్ బాగా ఉధృతంగా ఉన్న టైంలో స్త్రీ 2, భూల్ భులాయ్యా 3, షైతాన్ లాగా ఇది కూడా వర్కౌట్ అవ్వొచ్చనే నమ్మకం బయ్యర్లలో ఉండేది కానీ కంటెంట్ మాత్రం ఆ స్థాయిలో లేదు. కథగా చూస్తే రొటీన్ గానే అనిపిస్తుంది. చంద్రాపూర్ అనే స్వంత ఊరికి వెళ్లిన శువంకర్ (ఇంద్రనీల్) అనూహ్య రీతిలో హత్యకు గురవుతాడు. దీంతో అక్కడున్న తమ బంగాళా అమ్మడానికి భార్య అంబికా (కాజోల్), కూతురు శ్వేత (ఖేరిన్ శర్మ) తో కలిసి అక్కడికి వెళ్తుంది. ఆడపిల్లలను అరిష్టంగా భావించే ఆ ఊరిలో ఇద్దరికీ ప్రమాదాలు ఎదురవుతాయి. దెయ్యాలు వెంటాడతాయి. తర్వాత జరిగేదే అసలు స్టోరీ.

దర్శకుడు విశాల్ పురియా విఎఫెక్స్, థ్రిల్ ఎలిమెంట్స్ మీద పెట్టిన శ్రద్ధ అసలైన కథా కథనాల మీద చూపించలేదు. అందుకే మా అధిక శాతం చప్పగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నెమ్మదిగా సాగుతూ పెద్దగా ఆసక్తి కలిగించదు. ఇంటర్వెల్ నుంచి కొంచెం గేరు మార్చినా మరీ కొత్తగా అనిపించే ఎపిసోడ్లు లేకపోవడం మా పాలిట శాపంగా మారింది. క్లైమాక్స్ ఘట్టం కొంచెం పర్వాలేదనిపించినా బలవంతంగా ఇరికించిన సైతాన్ కనెక్షన్ తుస్సుమనిపించింది. ఆర్టిస్టుల పరంగా అందరి పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నప్పటికీ వాటిని వాడుకునే బలమైన కంటెంట్ లేకపోవడం మా స్థాయిని తగ్గించేసింది. హారర్ ట్రెండ్ ఈసారి వర్కౌట్ అయ్యేలా లేదు.