ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ సాగిపోయాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ‘దంగల్’ సినిమా చైనాలో కూడా అదరగొట్టడంతో ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని సైతం ఆమిర్ అందుకున్నారు. అలాంటి హీరో గత రెండు చిత్రాలతో దారుణమైన ఫలితాలందుకున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి.
ముఖ్యంగా ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదల ముంగిట ఆమిర్ మీద విపరీతమైన నెగెటివిటీ ముసురుకోవడం, ఆ సినిమాకు టాక్ కూడా బాలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. తొలి రోజు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవరాల్‌గా అది భారీ డిజాస్టర్ అయింది. ఐతే ఆమిర్ కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ చుట్టూ కూడా అదే తరహాలో నెగెటివిటీ కనిపించడం.. దీన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ఉద్యమాలు జరగడంతో ఆమిర్ అండ్ కోలో ఆందోళన తప్పలేదు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా కనిపించలేదు.
ఎన్నో భయాల మధ్య గత శుక్రవారం ‘సితారే జమీన్ పర్’ను రిలీజ్ చేసింది ఆమిర్ బృందం. ఐతే ఈ సినిమాకు టాక్ కొంచెం డివైడ్‌గా వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. తొలి రోజు రూ.11 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్లో రూ.50 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లింది. ఒకప్పుడు ఆమిర్ సాగించిన వసూళ్ల ప్రభంజనంతో పోలిస్తే ఈ కలెక్షన్లు తక్కువే అయినా.. ‘లాల్ సింగ్ చడ్డా’ తర్వాత ఇది ఎంతో బెటర్ పెర్ఫామెన్స్ అనడంలో సందేహం లేదు. వీకెండ్ తర్వాత కూడా సినిమా పర్వాలేదనిపించే వసూళ్లతో సాగుతోంది.
ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.95 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ రోజే వంద కోట్ల మైలురాయిని కూడా దాటబోతోంది. ఒకప్పుడు ఆమిర్ సినిమాలు అలవోకగా వందలకోట్ల వసూళ్లు రాబట్టేవి. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో వంద కోట్ల మైలురాయి కూడా ఆయనకు ఉపశమనాన్ని ఇచ్చేదే. ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్ లాంచ్ అయినపుడు నెగెటివిటీ చూస్తే ఆయనకు ‘లాల్ సింగ్ చడ్డా’ తరహాలోనే బాక్సాఫీస్ దగ్గర మరో పరాభవం ఎదురు కాబోతోందా అన్న చర్చ జరిగింది. కానీ ఈ సినిమా ఉన్నంతలో మంచి వసూళ్లే సాధించి ఆమిర్‌ను నిలబెట్టింది. ఆమిర్ మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేయడానికి అవసరమైన ఊతాన్ని ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates