గత కొన్నేళ్లలో బ్రహ్మానందం సినిమాలు తగ్గించేసి, బయట కనిపించడం కూడా అరుదైపోయింది కానీ.. ఆయన ఏదైనా సినిమాలో మాంచి కామెడీ క్యారెక్టర్ చేసినా, అలాగే ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నా నవ్వుల పువ్వులు పూయాల్సిందే. స్వతహాగా మంచి రచయిత, మాటకారి కావడంతో బ్రహ్మి మైక్ అందుకుంటే పంచులకు కొదవ ఉండదు. ఆయన చాన్నాళ్ల తర్వాత ఓ ఈవెంట్లో తన మార్కు హాస్యంతో అలరించారు. మంచువారి ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బ్రహ్మి.. ఆడిటోరియాన్ని నవ్వుల్లో ముంచెత్తారు.
మోహన్ బాబు సినిమాల్లో మీరు ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా అంటూ యాంకర్ సుమ.. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు చిత్రాలను ఆప్షన్స్‌గా ఇచ్చారు. దీనికి బ్రహ్మి బదులిస్తూ.. అసెంబ్లీ రౌడీ ప్రస్తావన తెచ్చారు. ఆ సినిమాను తనే చేయాల్సిందని… కానీ రిజెక్ట్ చేశానని బ్రహ్మి అన్నారు. అంతటితో ఆగకుండా.. మోహన్ బాబు తన ఇంటికి వచ్చి ఈ సినిమా నేను చేసుకుంటా అని ప్రాథేయపడడంతో ఇక చేసేది లేక ఆ సినిమాను వదులుకున్నట్లు బ్రహ్మి చెప్పాడు. ఈ మాట అంటూ బ్రహ్మి బాధగా మొహం పెట్టడంతో అందరూ గొల్లుమని నవ్వారు.
ఆ తర్వాత స్టేజ్ మీద బ్రహ్మి ప్రసంగిస్తూ కూడా మోహన్ బాబు మీద పంచులు వేశారు. మోహన్ బాబు డబ్బుకు చాలా ప్రాధాన్యం ఇస్తారని.. ఆయన 5 రూపాయిలు పెట్టి 10-15 రూపాయలు రాబట్టాలనుకునే రకమని.. అలాంటిది కన్నప్ప మీద 200 కోట్లు పెట్టారంటే మామూలు విషయం కాదని.. ఇందులో ఏదో ఉందని బ్రహ్మి అన్నారు. కన్నప్ప గొప్ప సినిమా అవుతుందని.. దీనికి శివుడి అనుగ్రహం ఉంటుందని బ్రహ్మి పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమా చూడాలని.. అంతే తప్ప అల్లరి చేయొద్దంటూ ట్రోల్ చేసే వారిని బ్రహ్మి సుతిమెత్తగా హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates