నోలన్ కూడా అప్‌డేట్ ఇచ్చాడు.. మనమెప్పుడు జక్కన్నా…

ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే.. ఎక్కువమంది చెప్పే పేరు క్రిస్టఫర్ నోలన్‌దే. నవతరం ప్రేక్షకుల ఫేవరెట్ అతనే. అతను ఏ సినిమా తీసినా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వైవిధ్యమైన సినిమాలతో.. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాడు. నోలన్ చివరి సినిమా ‘ఆపెన్‌హీమర్’ కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టింది. నోలన్ ఏ సినిమా మొదలుపెట్టినా.. మేకింగ్ సమయంలో సౌండ్ చేయడు. సైలెంట్‌గా పని మొదలుపెట్టి సడెన్‌గా అప్‌డేట్ ఇస్తాడు.

తన కొత్త చిత్రం ‘ది ఒడిస్సీ’ విషయంలోనూ అదే చేశాడు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ఒక ఆసక్తికర పోస్టర్‌తో ఈ విషయాన్ని ప్రకటించారు.
వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ నోలన్ అప్‌డేట్ ఇవ్వగానే.. ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ మీదికి మన ప్రేక్షకుల దృష్టిమళ్లింది. అది రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయిన జక్కన్న.. దాని తర్వాత మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం నుంచి అప్‌డేట్ కోసం అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

మామూలుగా తన సినిమా మొదలయ్యే ముందు లేదా మొదలైన కొన్ని రోజులకు ప్రెస్ మీట్ పెట్టి కథ, ఇతర విషయాల గురించి పంచుకుంటాడు జక్కన్న. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. చిత్రీకరణ మొదలై ఆరు నెలలు దాటింది. అయినా అధికారికంగా ఏ సమాచారాన్ని పంచుకోలేదు. రాజమౌళి ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నా సరే మహేష్ సినిమా ఊసు ఎత్తట్లేదు. ఈసారి ఎందుకింత గోప్యత పాటిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని.. ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలు పంచుకోవడమో.. లేదా సినిమా నుంచి ఏదైనా విశేషాన్ని పంచుకోవడమో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కనీసం మహేష్ బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9కైనా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.