వారణాసిలో మహేష్ బాబు…ఏంటి కథ

మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు రేపుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కీలక దశకు చేరుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల రూపాయలతో వేసిన వారణాసి సెట్లో ముఖ్యమైన ఎపిసోడ్ తీయడానికి రంగం సిద్ధమయ్యింది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ లో మహేష్ బాబు వేటగాడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. మరి కాశికి వెళ్లి ఏం చేస్తాడనే ఆసక్తి కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అడవికి వెళ్ళడానికి ముందు ఒక రహస్యాన్ని సంబంధించిన ట్విస్టులు వారణాసిలో జరుగుతాయని, చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తారని అంటున్నారు.

నిజానికి ఒరిజినల్ వారణాసిలోనే చిత్రీకరణ జరపాలని తొలుత అనుకున్న రాజమౌళి తర్వాత మనసు మార్చుకున్నారు. షూట్ టైంలో వచ్చే రద్దీని నియంత్రించలేని పరిస్థితి తలెత్తడంతో పాటు అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయలేమనే భావనతో చివరికి సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇప్పటిదాకా ఇంత ఖరీదైన సెట్ ఏ సినిమాకు వేయలేదు. బాలీవుడ్ గ్రాండియర్లుగా చెప్పుకునే బాజీరావు మస్తానీ, దేవదాస్, హీరామండిలకు పాతిక కోట్ల లోపే ఖర్చయ్యిందట. అయితే అవన్నీ మొత్తం సినిమా అక్కడ షూట్ చేసినవి. కానీ ఎస్ఎస్ఎంబి 29కి వేసింది కేవలం ఒక భాగం కోసం మాత్రమే.

ఫిలిం సిటీలో  ఆ సెట్ ని దగ్గరి నుంచి చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఫోటోలు గట్రా తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు కానీ దూరం నుంచి డ్రోన్ తరహాలో పిక్స్ తీసినవాళ్లు లేకపోలేదు. బాహుబలి ఎలాగైతే రామోజీ ఫిలిం సిటీలో ఒక ల్యాండ్ మార్క్ స్పాట్ గా మారిపోయిందో అదే తరహాలో ఇప్పుడీ వారణాసి కూడా నిలిచిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆఫ్రికా వెళ్ళబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సభ్యుల్లో కొందరికి ఇంకా వీసాలు రావాలని, అందుకే కొంత ఆలస్యమవుతోందని, అక్కడ జరిగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో ముఖ్యమైన పార్ట్ అయిపోతుందని సమాచారం. 2027 రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.