సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ కి మూడు ముళ్ళు వేయబోతున్నాడని హఠాత్తుగా నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఉదయానికి అవి పీక్స్ కు చేరుకున్నాయి. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ ఉందని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారని పలు మీడియా సంస్థలు కథనాలు వడ్డించడంతో ఫ్యాన్స్ వాటిని ఆసక్తిగా ఫాలో అయ్యారు. కానీ అనిరుధ్ ఈ గాసిప్ పబ్లిసిటీకి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, ఛిల్ అవ్వమని వాటిని సృష్టించిన వాళ్లకు చెబుతూ తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు.
సరే ఖండించడం వరకు బాగానే ఉంది కానీ అనిరుధ్ రవిచందర్ మరీ లేత కుర్రాడేమీ కాదు. వయసు 34 సంవత్సరాలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తనకు సంబంధాలు చాలానే వస్తుంటాయి. అందులోనూ రజనీకాంత్ బంధుత్వం ఉంది కాబట్టి ఆయన కూడా సలహా ఇచ్చే ఉంటారు. ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగిపోవాలి. కానీ అనిరుధ్ మాత్రం దానికి ఇంకా సమయం ఉందంటున్నాడు. నిజానికి తనకున్న కమిట్ మెంట్లకు స్వంత వేడుక చేసుకునే తీరిక కూడా లేదు. వరస ప్యాన్ ఇండియా సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేంత బిజీలో ఉన్నాడు. అందుకే మ్యారేజ్ దూరం కాబోలు.
ఇక కెరీర్ విషయానికి వస్తే రాబోయే ఆరు నెలలు అనిరుద్ రవిచందర్ కు కీలకం కాబోతున్నాయి. రజనీకాంత్ కూలి మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మీద ఫ్యాన్స్ నమ్మకం అంతా ఇంతా కాదు. విజయ్ చివరి మూవీ జన నాయగన్ కు బెస్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జైలర్ 2 మీద ఎలాగూ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఇవి కాకుండా ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శివ కార్తికేయన్ మదరాసి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాయి. నాని ది ప్యారడైజ్ మీద ఉన్న అంచనాలు చెప్పనక్కర్లేదు. సో కుర్రాడి పెళ్లి కబురుకు ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates