-->

మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం

ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. తాజాగా మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లి వద్ద ఒక రిసార్టులో జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు గంజాయి, విదేశీ మద్యం సరఫరా అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రిసార్టుపై దాడి చేశారు.
అనుమతి లేని విదేశీ మద్యంతో పాటు గంజాయి దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకుని మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ పార్టీలో దాదాపు 50 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మంది గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీలో కొందరు సినీ జనాలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ ఇటీవల తరచుగా నెగెటివ్‌ న్యూస్‌లతో నిలుస్తోంది. కొన్ని నెలల కిందట శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయానికి వెళ్లిన ఆమెకు రాచమర్యాదలు దక్కడం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయడం పట్ల తెలుగుదేశం అభిమానులు మండిపడ్డారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా టీవీ షోలు చేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేసి.. వైసీపీ హయాంలో పదవి కూడా దక్కించుకున్న ఆమెకు ఈ గౌరవం దక్కడం తెలుగుదేశం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంలో ఆమె తాను ఏ పార్టీకీ వ్యతిరేకం కాదంటూ ఒక మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆ గొడవ తర్వాత ఇప్పుడు మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి దొరకడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, వైసీపీ మద్దతుదారుగా ముద్ర ఉన్న మంగ్లీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.